సినిమాలయందు మురుగదాస్ సినిమాలు వేరయా అని అంటుంటారు. అలా అని ఆయన కమర్షియల్ సినిమాలకు దూరంగా ఏమీ వెళ్లరు. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటూనే సందేశాత్మక చిత్రాలు చేస్తుంటారు. దానికి ఆయన స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పి కొన్ని సినిమాలు ఇబ్బందికర ఫలితాలు అందుకుంటూ ఉంటాయి. అందుకే ఏమో గత కొన్ని రోజులగా ఆయన కొత్త సినిమా అనేసరికి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అయితే వాటన్నింటిని తేల్చుకుని ఆయన కొత్త ప్రాజెక్ట్ షురూ చేశారు.
మురుగదాస్ కొత్త సినిమా మొదలవ్వడం కాదు కానీ… తెలుగులో ఇద్దరు హీరోల కొత్త సినిమాలు ఏంటి అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే శివ కార్తికేయన్ కథానాయకుడిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందనున్న పాన్ ఇండియా సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను లాంఛనంగా ఇటీవల ప్రారంభించారు. అయితే ఆ విషయాన్ని చిత్ర బృందం గురువారం ప్రకటించింది.
వినూత్నమైన కథాంశంతో రూపొందుతోన్న యాక్షన్ సినిమా ఇదని, మునుపెన్నడూ చూడని విధంగా కార్తికేయన్ ప్రత్యేక స్టైలిష్ పాత్రలో చూపిస్తామని టీమ్ అంటోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో సినిమా తెరకెక్కుతోందని చెబుతున్నా…ఆఖరికి వచ్చేసరికి ఎంతవరకు ఇది రెండు భాషల సినిమా అవుతుంది అనేది తేలుతుంది. ‘ప్రిన్స్’ విషయంలోనూ ఇలానే చెప్పారు కానీ… ఆఖరికి తమిళ సినిమాగానే రూపొందించి, తెలుగులో డబ్ చేశారు. ఇక క్లారిటీ వచ్చిన హీరోల సినిమాల సంగతి చూస్తే…
ఇటీవల కాలంలో మురుగదాస్ (Ar Murugadoss) ప్రాజెక్ట్లు ఇవి అవ్వొచ్చు అంటూ ఓ లిస్ట్ బయటికొచ్చింది. అందులో చాలా కాలంగా వినిపిస్తున్న అల్లు అర్జున్ పేరు ఒకటి. పాలిటిక్స్ రిలేటెడ్ మూవీతో బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారని మరొకటి వినిపించాయి. కథలు చెప్పడం కూడా అయ్యిందని, కానీ ప్రాజెక్ట్లు తేలడం లేదన్నారు. అయితే ఇప్పుడు ఎస్కే సినిమా మొదలవ్వడంతో అవన్నీ లేనట్లే అని చెప్పొచ్చు. అన్నట్లు ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ ఉండొచ్చు అన్నారు. కానీ అవ్వలేదు.