2015లో తమిళనాట భీభత్సమైన హల్ చల్ చేసిన ఫేక్ సర్టిఫికేట్ స్కామ్ ఆధారంగా తమిళంలో రూపొందిన “కనితన్” అనే చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కి గతేడాదే విడుదలవ్వాల్సి ఉండగా.. టైటిల్ మరియు ఆర్ధిక సమస్యల కారణంగా విడుదలవ్వలేక.. ఇన్నాళ్లకు విడుదలవుతున్న చిత్రం “అర్జున్ సురవరం”. నిఖిల్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రం నేడు (నవంబర్ 29) విడుదలైంది. మరి హిట్ కొట్టాలన్న నిఖిల్ ఇన్నాళ్ల కల ఫలించిందో లేదో చూద్దాం..!!
కథ: అర్జున్ లెనిన్ సురవరం (నిఖిల్) ఆధునిక సమాజంలో పాత్రికేయుడిగా రాణించాలని పరితపించే సామాజిక బాధ్యత ఉన్న యువకుడు. మంచి కుటుంబం, స్నేహితులు, ప్రేమించిన యువతి, ఇష్టపడి చేసే పని, త్వరలోనే చేరుకోబోయే లక్ష్యం. ఇలా అంతా సంతోషమే అనుకొంటున్న తరుణంలో.. “నువ్వు ఫేక్.. నీ చదువు ఫేక్” అని ప్రభుత్వం, పోలీసులు, కోర్టు, మీడియా అర్జున్ సురవరం జీవితం మీద ఒక ‘ముద్ర” వేస్తుంది.
తాను ఇన్నాళ్ళు కష్టపడి చదుకున్న చదువు ఫేక్ అని తనపై పడిన ముద్రను పోగొట్టుకోవడం కోసం అర్జున్ చేసిన పోరాటమే “అర్జున్ సురవరం” చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు: నిఖిల్ చాలా రోజుల తర్వాత తన యాక్టింగ్ ప్యాటర్న్ మార్చిన సినిమా ఇదేనని చెప్పొచ్చు. నిఖిల్ లోని ఒక సరికొత్త యాంగిల్ ఈ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమవుతుంది. అగ్రెసివ్ గా కనిపిస్తూనే.. ఆలోచింపజేసే పాత్రలో ఆకట్టుకొన్నాడు నిఖిల్. లావణ్య త్రిపాఠి పాత్ర రెగ్యులర్ హీరోయిన్ లా కాకుండా కాస్త కథ-కథనంలోను ఇన్వాల్వ్ అయ్యి అలరించింది. ఆమె అందం, అభినయం సినిమాకి ప్లస్ అయ్యాయి. తరుణ్ అరోరా విలనిజం రొటీన్ గా అనిపించింది. వెన్నెల కిషోర్, విద్యుల్లేఖ రామన్ పాత్రలు కాస్త నవ్వించగా.. పోసాని చాలారోజుల తర్వాత అర్ధవంతమైన పాత్రలో కనిపించారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు టి.ఎన్ సంతోష్ తమిళ వెర్షన్ కు తెలుగు వెర్షన్ కు ఎలాంటి మార్పులు లేకుండా తెరకెక్కించడం సినిమాకి మైన్ మైనస్. నేటివ్ ఇష్యూస్ ని ఇన్వాల్వ్ చేసి ఉంటే బాగుండేది. అది కొరవడడంతో పూర్తిస్థాయి తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ మాత్రం కలగదు. ప్రొడక్షన్ డిజైన్ పర్వాలేదు.. ఆర్ట్ వర్క్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. గ్రాఫిక్స్ వర్క్ కూడా కాస్త చీప్ గా ఉంది.
సామ్ సి.ఎస్ ఈ సినిమాకి సమకూర్చిన పాటలన్నీ ఆల్రెడీ పలు తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా ఆల్రెడీ వినేసి ఉండడంతో.. విజువల్స్ బాగున్నా.. ఆసక్తి ఉండదు.
నవీన్ నూలి ఎడిటింగ్, సూర్య సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.
విశ్లేషణ: సినిమా రిలీజ్ లేట్ అవ్వడం “అర్జున్ సురవరం” మీద ఆసక్తిని కిల్ చేస్తే.. కొత్తదనం కొరవడిన కథనం బోర్ కొట్టిస్తుంది. ఈ రెండు అవరోధాలను దాటుకొని విజయాన్ని అందుకొనే ప్రయత్నంలో ఆమడ దూరంలో ఆగిపోయాడు నిఖిల్. కాకపోతే.. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం సరదాగా ఒకసారి చూడదగిన చిత్రం “అర్జున్ సురవరం”.
రేటింగ్: 2.5/5