‘స్కామ్ 1992’తో గుజరాతీ నటుడు ప్రతీక్ కి మంచి క్రేజ్ వచ్చింది. అలాంటి నటుడిని ఇప్పుడు అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాలో కొందరు డిమాండ్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే.. ప్రతీక్ ‘భవాయి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అందులో కొన్ని సన్నివేశాలను అభ్యంతరకరంగా ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు. మొదట ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా వివాదం జరిగింది. ముందుగా ఈ సినిమాకి ‘రావణ్ లీలా’ అనే టైటిల్ పెట్టారు.
అది వివాదాస్పదం కావడంతో ‘భవాయి’గ మార్చేశారు. అయినా.. వివాదం చల్లారలేదు. మొన్నీమధ్య ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా.. అందులోని సన్నివేశాలపై ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాను నిషేధించాలని డిమాండ్ మొదలైంది. ‘భవాయి’ అనేది గుజరాతీ జానపద నాటక కళ. ఈ కళ ఆధారంగానే దర్శకుడు హార్థిక్ గజ్జర్ ఈ సినిమాను రూపొందించాడు. అయితే ఇందులో ప్రధాన పాత్రల మధ్య లవ్ సీక్వెన్స్ చూపించే క్రమంలో.. మతపరమైన మనోభావాలు దెబ్బతీశారని కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
అందుకే సినిమాలో హీరోగా నటించిన ప్రతీక్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరైతే సినిమాను బ్యాన్ చేయాలంటూ కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ వివాదం ఎప్పటికి సద్దుమణుగుతుందో చూడాలి!