మ్యాజిక్ ఒకసారే బాగుంటుంది. మారుమారు చూడటానికి అంత ఆసక్తి ఉండకపోవచ్చు. ఇదే సినిమాలకు కూడా వర్తిస్తుంద. ఒకసారి మ్యాజిక్ చేసిన సినిమా మరోమారు అదే స్టైల్ కథతో వస్తే ఆకట్టుకోవాలని లేదు. ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే ‘అవతార్’ సినిమాలు చూడాలి. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాల్లో తొలి సినిమా ఇచ్చిన కిక్.. రెండో పార్టు ఇవ్వలేదు. దీంతో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. అయితే ఇప్పుడు మూడో పార్టు విడుదలకు రంగం సిద్ధమవుతోంది. దీంతో మరోసారి ‘అవతార్’ చర్చ మొదలైంది.
2009లో దర్శకుడు జేమ్స్ కామెరూన్ ‘అవతార్’ సినిమాతో అదరగొట్టారు. అప్పటివరకు అలాంటి కథను, ప్రపంచాన్ని చూడని జనాలకు అదొక అద్భుతంలా అనిపించింది. ఆ తర్వాత 13 ఏళ్లకు రెండో ‘అవతార్’ వచ్చింది. అదీ ఆకట్టుకున్నా.. తొలి సినిమా స్థాయి ఎఫెక్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ పేరుతో మూడో భాగంగా డిసెంబరు 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు తొలి రెండు సినిమాల స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్, స్పందన లేదు అని సమాచారం.
కారణం ఏంటా అని చూస్తే.. ఎలాంటి అంచనాలు లేకుండా 2009 డిసెంబరులో విడుదలైంది ‘అవతార్’. 237 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2.923 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఆ సినిమా తర్వాత ‘అవతార్’ పెద్ద సబ్జెక్ట్ అని, ఐదు భాగాలుగా తీసుకొస్తామని కామెరూన్ ప్రకటించారు. అయితే ఆలస్యంగా వచ్చిన రెండో సినిమా వసూళ్ల విషయంలో 2.343 బిలియన్ డాలర్లు దగ్గర ఆగిపోయింది. ఆ ఎఫెక్టో ఏమో మూడో పార్టుకు అంత మజా లేకుండా పోయింది.
దీంతో ‘అవతార్’ మూడో పార్ట్ క్రేజ్ తగ్గిందా అనే ప్రశ్న వస్తోంది. అయితే, ఈసారి కంటెంట్ భిన్నంగా ఉంటుందని కామెరూన్ అంటున్నారు. రెండో భాగంలో చేసిన తప్పులను ఈసారి లేకుండా చూసుకున్నాం అని కూడా చెబుతున్నారు. తొలి రెండు భాగాల్లో లేని అద్భుతాలను మూడో పార్ట్‌లో చూస్తారని కూడా అంటున్నారు. మరి ఆయన చెప్పినట్లు చేశారా? లేదా అనేది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాలి.