Avika Gor: ఆ విషయంలో నేను హ్యాపీ అంటున్న అవికా గోర్‌.. ఎందుకంటే?

సినిమాల్లో భయపెట్టడం చాలా కష్టం అని అంటుంటారు. అందుకే ఆ జోనర్‌లో చేసే సినిమాలకు విజయాల శాతం తక్కువగా ఉంటుంది. ఎంతో కష్టపడి తీసినా.. భయపెట్టడంలో విఫలమైతే దారుణమైన ఫలితం అందుకుంటారు. రీసెంట్‌గా ఇలాంటి ప్రయత్నం చేసి ఓ వర్గం ప్రేక్షకుల్ని అలరించిన కథానాయిక అవికా గోర్‌ (Avika Gor) . ఈ నేపథ్యంలో తనకు మాత్రమే దక్కిన అరుదైన అవకాశం గురించి అవికా మాట్లాడింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

బాలీవుడ్‌ ప్రముఖులు మహేశ్‌ భట్‌, విక్రమ్‌ భట్‌తో  (Vikram Bhatt)  కలసి రెండు సినిమాలు చేయడంపై ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. అలాంటి అవకాశం అందరికీ రాదని, తనకు మాత్రమే దక్కింది అని గొప్పగా చెప్పుకుంది. అవికా గోర్‌ – మహేశ్‌ భట్‌ – విక్రమ్‌ భట్‌ కలసి ఇటీవల ‘బ్లడీ ఇష్క్’ అనే సినిమా చేశారు. ఈ సిఇనిమా నేరుగా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఈ సినిమా ప్రచారంలో భాగంగానే అవికా అలా మాట్లాడింది.

మహేశ్‌ భట్‌, విక్రమ్‌ భట్‌తో కలసి పని చేయడం నా అదృష్టం. సెట్స్‌లో వారి నుండి కొత్త విషయాలు చాలా నేర్చుకున్నా. వారిద్దరూ నాకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఆ సినిమాను నేను చేయడానికి కారణం ఆ కథ నన్ను ఎంపిక చేసుకోవడమే అని చెబుతోంది. ఫలానా దర్శకుడితో కలసి పని చేయాలని, ఆయన సినిమాలో నటించాలని కలలు కంటుంటారు చాలామంది. అలాంటి వారిలో నేనూ ఉన్నాను. అయితే రెండుసార్లు ఛాన్స్‌ రావడం అదృష్టం.

విక్రమ్‌ భట్‌ డైరెక్షన్‌లో రెండు సినిమాల్లో నటిస్తానని, ఆ సినిమాలకు మహేశ్‌ భట్‌ కథ అందిస్తారని ఎప్పుడూ అనుకోలేదు అని అంది అవికా గోర్‌. ఇంతకుముందు అవిక – మహేష్‌ – విక్రమ్‌ కలసి ‘1920: హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌’  (1920: Horrors of the Heart) అనే సినిమా చేశారు. ఇప్పుడు ‘బ్లడీ ఇష్క్‌’ చేశారు. రెండూ హారర్‌ స్టోరీలే. రెండూ మంచి ఫలితాన్నే ఇచ్చాయి. ఇక అవిక సినిమాల సంగతి చూస్తే.. తెలుగులో ఆది సాయికుమార్‌తో ‘షణ్ముఖ’ అనే సినిమా చేస్తోంది. అక్టోబరులో ఈ సినిమా రిలీజ్‌ చేస్తారట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus