బిగ్‌బాస్ ఇంట్లో అందరినీ నవ్విస్తూ, సరదాగా ఉంటాడు అవినాష్. జోకర్‌గా ఇంట్లో ఎంట్రీ ఇచ్చిన అవినాష్ జీవితంలో కష్టాలున్నాయని ఆయన ఇంట్రోలోనే చూపించారు. అయితే అవేంటి అనేది ఆ రోజు తెలియలేదు. వాటిని ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో వివరించాడు. మార్నింగ్ మస్తీలో భాగంగా బిగ్‌బాస్ జీవిత సందేశం వివరించమన్నాడు. అప్పుడు తను కొన్నాళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నా అనే షాకింగ్ విషయం తెలిపాడు.
నేను కుటుంబం, ప్రేక్షకులునే నమ్ముతాను. ప్రేక్షకుల వల్లే నేను ఇలా ముక్కు అవినాష్‌గా మీ ముందున్నాను. అయితే లాక్‌డౌన్ సమయంలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా అంటూ షాకింగ్ విషయం చెప్పాడు అవినాష్. ఇల్లు ఈఎంఐ నెలకు ₹45 వేలు కట్టాలి. లాక్‌డౌన్ సమయంలో డబ్బులు లేకపోయాయి. అలాంటప్పుడు ఇల్లు ఎందుకు కొన్నావని అందరూ అనొచ్చు. ఇల్లు కొందామని నిర్ణయించుకున్నాక… ఇంట్లో అమ్మ, నాన్నకు అనారోగ్యం చేసింది. దీంతో ఇంటి కోసం పెట్టుకున్న డబ్బుల్లో కొంత వాళ్ల ఆసుపత్రి ఖర్చులకు అయిపోయాయి. దీంతో బయట 13 లక్షలు అప్పు చేశాను అని అవినాష్ వివరించాడు.
అయినా నేను ఏం చేసినా అది ఇంట్లో వాళ్ల కోసమే. అమ్మ, నాన్న కోసం నేను ఇదంతా చేశాను. వాళ్లు బాగుండాలని చేశాను. వాళ్లను నా జీవితాంతం చూసుకోవాలి. దాని కోసం ఎంత కష్టమైనా పడతాను. అందుకు తల్లిదండ్రులతో స్పెండ్ చేయండి. వాళ్లు పోయాక వాళ్ల విలువ తెలిసినా ఏం చేయలేం. అందుకే పేరెంట్స్‌ని గౌరవించండి. ఓల్డేజ్ హోంలో పెట్టకండి. వాళ్లు ఉండబట్టే మనం ఇక్కడ ఉన్నాం అనే విషయం గుర్తుంచుకోండి అని చెప్పాడు. ప్రతి నవ్వు వెనుక… కష్టం, ఏడుపు ఉంటాయని అందరూ అంటారు. అది ఇదేనేమో.