విలక్షణ పాత్రలు చేయడమే కాదు.. విపరీతమైన కామెంట్లు చేయడంలోనూ ప్రముఖ నటి రాధికా ఆప్టేకు (Radhika Apte) పేరుంది. గతంలో దక్షిణాది సినిమా పరిశ్రమలో వేధింపుల తరహా ఇబ్బంది ఎదుర్కొన్నా అంటూ ఆమె కొన్ని కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఆ కామెంట్ల తర్వాత మళ్లీ ఆమె ఇటువైపు ఏ సినిమాలోనూ నటించలేదు. ఆఖరిగా ఆరేళ్ల క్రితం ఓ తమిళ సినిమాలో నటించింది. ఇప్పుడు ఇన్నాళ్లకు మరో సౌత్ సినిమాకు ఓకే చెప్పింది అని సమాచారం. అది కూడా తమిళ హీరోతో తెరకెక్కనున్న తెలుగు దర్శకుడి సినిమా ఇది.
దేశంలో చాలా భాషల్లో సినిమాలు చేసినా.. ఎక్కువగా బాలీవుడ్ నాయికగానే రాధికా ఆప్టేకి పేరు. తమిళంలో ‘ధోని’, ‘కబాలి’ (Kabali) సినిమాల్లో నటించినా.. తెలుగులో ‘లయన్’ (Lion), ‘లెజెండ్’ (Legend) చిత్రాలు చేసినా ఆమెకు స్టార్ హీరోయిన్ గుర్తింపు రాలేదు. అందుకేనేమో బాలీవుడ్ సినిమాల మీద ఈ మధ్య ఎక్కువగా దృష్టిసారించింది. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) – విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు ఓకే చెప్పిందట. త్వరలో ఈ విషయం సినిమా టీమ్ ప్రకటిస్తుందని సమాచారం.
పూరి జగన్నాథ్‌కు వరుస పరాజయాల తర్వాత విజయ్ సేతుపతితో సినిమా చేస్తానని ప్రకటించి అందరికీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత అందులో మరో ముఖ్య పాత్రకు టబును ఎంచుకుని ఇంకా పెద్ద షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే కోవలో రాధికా ఆప్టేను సినిమాలోకి తీసుకున్నారట. సినిమా టీమ్ జోరు చూస్తుంటే కాస్టింగ్ విషయంలో చాలా కొత్తగా ఆలోచనలు చేస్తోంది అని తెలుస్తోంది.
పోనీలెండి ఈ సినిమా ప్రచారం కోసం బయటికొచ్చినప్పుడు ఆమెను ‘ఇబ్బంది పెట్టిన సౌత్ నటుడు’ ఎవరు అనేది తెలుసుకోవచ్చు. అయినా ఆమె క్లియర్ ఎవరు అనేది చెబుతుంది అని అనుకోలేం. అయితే చూఛాయగా ఆ హీరో ఎవరో తెలిసే అవకాశం అయితే ఉంది. పాస్ట్ ఈజ్ పాస్ట్ ఇప్పటికైనా ఆమెను ఇబ్బంది పెట్టకుండా నటింపజేస్తే చాలు.. మంచి నటి కదా మిస్ అవ్వకూడదు సౌత్ సినిమా పరిశ్రమ.