దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన వెండితెర కళాఖండం బాహుబలి కంక్లూజన్ ప్రపంచవ్యాప్తంగా కలక్షన్ల వర్షం కురిపించింది. 1800 కోట్లు వసూలు చేసి 2000 కోట్ల క్లబ్ లో చేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. చిత్ర నిర్మాతలు ఈ సినిమాని చైనా, ఇతర భాషల్లో అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే బాహుబలి రోజుకో అవార్డును, గౌరవాన్ని అందుకుంటూ చిత్ర బృందానికి ఉత్సాహాన్ని ఇస్తోంది. మొన్న మెల్ బోర్న్ లో జరిగిన ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లో బాహుబలి కంక్లూజన్ ప్రదర్శనకు నోచుకోని తెలుగు వారి ప్రతిభను మరికొంతమంది వీక్షించేలా చేసింది. తాజాగా మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది.
ఆర్మేనియా రాజధాని ఎరవాన్‌లో నిర్వహించనున్న “ఇండియన్ ఫిల్మ్స్ ఫెస్టివల్ ” లో బాహుబలి 2 ప్రదర్శనకు ఎంపికైంది. వీటితోపాటు శ్రీదేవి నటించిన “మామ్”, ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన “హిందీ మీడియం” సినిమాలను ప్రదర్శించనున్నారు. ప్రతి ఏడాది భారత్‌లో అత్యధిక ప్రజాదరణ పొందిన, అవార్డులు అందుకున్న సినిమాలను ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తుంటారు. ఈ సారి రిపబ్లిక్ డే నాడు జరిగే వేడుకలో ఈ మూడు చిత్రాలను ప్రదర్శించనున్నారు. అరుదైన గౌరవం అందుకున్నందుకు రాజమౌళి తో పాటు బాహుబలి కంక్లూజన్ బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా శ్రీదేవి భర్త, చిత్ర నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ.. తమ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించడం చాలా గర్వంగా ఉందన్నారు.