బాహుబలి సినిమాలు తెలుగువారి సత్తాని ప్రపంచానికి చాటాయి. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి బృందం ఐదేళ్లపాటు శ్రమించి రూపొందించిన ఈ చిత్రాలు నాలుగు భాషల్లో మనదేశంతో పాటు దుబాయ్, అమెరికాలో రిలీజ్ అయి సంచలనం సృష్టించాయి. కలక్షన్స్ పరంగానే కాకుండా అనేక ప్రాంతాల వారు బాహుబలి చిత్రానికి అరుదైన గౌరవం ఇచ్చారు. బాహుబలి-2 మూవీని పలు జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రత్యేకంగా షో వేశారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో బాహుబలి-2 స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. కొన్ని రోజుల కిందట రొమేనియాలో కూడా ఈ సినిమాను ప్రదర్శించారు. మాస్కోలో కూడా సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా ప్రదర్శించారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఏ తెలుగు సినిమాకి దక్కని గౌరవం బాహుబలికి దక్కింది.
తాజాగా రాజమౌళికి మరో అరుదైన ఆహ్వానం అందింది. పాకిస్తాన్‌లో జరిగే “పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్”లో పాల్గొనాలని రాజమౌళిని నిర్వాహకులు పిలిచారు. ఈ విషయాన్ని రాజమౌళి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “ఎన్నో దేశాల్లో పర్యటించే అవకాశం నాకు “బాహుబలి” సినిమా కల్పించింది. వాటన్నింటి కంటే మించి ఇప్పుడు పాకిస్తాన్‌లో పర్యటించబోతున్నా. కరాచీలో జరిగే `పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్`కు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు” అని రాజమౌళి ట్వీట్ చేశారు. భారతీయులంటే మండి పడే పాకిస్తానీయులు రాజమౌళి ని ఆహ్వానించడం అందరూ గర్వపడే అంశమనే చెప్పాలి.