కథానాయకుల్లా ఒక పరిశ్రమకు పరిమితం కాకపోవడం నాయికలకున్న అతిపెద్ద సౌకర్యం. ప్రాంతీయ భాషల్లో ఒకచోట పేరు తగ్గితే.. మరోచోట అవకాశాలు వెతుక్కుంటారు. దక్షిణాది నాయికలంతా ఈ తరహానే. వారిలో తాజాగా చేరింది రాశీ ఖన్నా. ఆమె కొత్త చిత్రం శ్రీనివాస కళ్యాణం బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. అంతకముందున్న తొలిప్రేమ విజయం కన్నా కొత్త సినిమా పరాజయమే ఈ సుందరిపై ప్రభావం చూపించింది. దీంతో తెలుగు అవకాశాలు తగ్గగా తమిళంపై దృష్టి సారించింది. నయనతారతో కలిసి “ఇమైక నోడిగల్”, సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న “సైతాన్ కా బచ్చా” చిత్రాలు చిత్రీకరణలో ఉండగానే మరో మూడు సినిమాలు చేజిక్కించుకుంది. వీటిలో విశాల్ హీరోగా నటిస్తున్న టెంపర్ రీమేక్ కూడా ఉంది. ఇలా టాలీవుడ్‌లో పేరు తగ్గగానే కోలీవుడ్‌లో జోరు పెంచిందీ భామ.
గత శుక్రవారం విడుదలైన “ఈమైక నోడిగల్” మంచి హిట్ సొంతం చేసుకొంది. నయనతార, అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ విమర్శకులతోపాటు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకొంది. ఈ చిత్రంతో రాశీఖన్నా కోలీవుడ్ లోనూ మంచి బోణీ కొట్టింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించేందుకు సన్నద్ధమవుతున్నారు.