రాముడు.. కృష్ణుడు.. భీముడు.. ఏ పాత్రనైనా అవలీలగా పోషించి నందమూరి తారకరామారావు తెలుగు ప్రజలకు వెండితెర దేవుడయ్యారు. రెండు రూపాయలకు కిలో బియ్యం.. మద్యనిషేధం వంటి పథకాలు, కార్యక్రమాలతో పేద ప్రజలకు నడిచే దేవుడయ్యారు. అటువంటి వ్యక్తి జీవిత చరిత్రను మూడు గంటల్లో చూపించడం చాలా కష్టమైన పని. అయినా అతని తనయుడు బాలకృష్ణ, దర్శకుడు తేజ సిద్ధమయ్యారు. ఈ బయోపిక్ మూవీ రెండు రోజుల క్రితం లాంఛనముగా ప్రారంభమయింది. రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకొని దసరాకి రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ అతని సినీ లైఫ్, పొలిటికల్ లైఫ్, పర్సనల్ లైఫ్ గురించి మూడు గంటల్లో చెప్పడం కష్టమని భావిస్తున్నారు. అతనితో కలిసి పనిచేసిన దర్శకనిర్మాతలు కూడా అదేమాటంటున్నారు.
అభిమానులు అయితే రెండు పార్టులుగా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. వీరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర యూనిట్ ఆలోచనలో పడింది. రెండు పార్టులుగా తెరక్కించడానికి సిద్ధమైంది. స్క్రిప్ట్ లో సర్దుబాట్లు చేసిన తర్వాత తేజ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారు. ఎన్‌బీకే ఫిలింస్ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి కొర్రపాటి, విష్ణువర్థన్ ఇందూరిలు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ఛాయగ్రాహకుడు సంతోష్ తుండియిల్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.