ఈ మధ్య కాలంలో బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి వరుస సక్సెస్ లలో ఉండటం, బాలకృష్ణ కోసం ఒక స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని వార్తలు రావడంతో ఈ కాంబినేషన్ లో సినిమా ప్రకటన కోసం బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే బాలయ్య పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన మాత్రం వెలువడలేదు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య అనిల్ రావిపూడి మూవీ కథ వినలేదా..? లేక కథ విని రిజెక్ట్ చేశారా..? అనే విషయం తెలియాల్సి ఉంది. బాలకృష్ణ లేదా అనిల్ రావిపూడి స్పందిస్తే మాత్రమే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్3 సినిమా పనులతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా తరువాత అనిల్ మహేష్ తో సినిమా చేయాలనే ప్రయత్నం చేసినా మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు ప్రకటన వెలువడటంతో మహేష్ అనిల్ ప్రాజెక్ట్ వాయిదా పడింది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్లకు వరుసగా ఆఫర్లు వస్తుంటే అనిల్ రావిపూడి విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతుండటం గమనార్హం. అనిల్ రావిపూడి కొత్త సినిమా ప్రకటన వెలువడితే మాత్రమే ఆయన తరువాత ప్రాజెక్ట్ లో హీరో ఎవరో తెలిసే అవకాశం ఉంటుంది.