‘హనుమాన్’ సినిమా టైంలో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. ఆ టైంలో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ , వెంకటేష్ ‘సైందవ్’, నాగార్జున ‘నా సామి రంగ’ వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అదే టైంలో ‘హనుమాన్’ సినిమా కూడా రిలీజ్ అవుతున్నట్టు ఒక నెల ముందు కన్ఫర్మ్ చేశారు. అప్పటికే థియేటర్స్ స్లాట్స్ అన్నీ అడ్జస్ట్మెంట్లు జరిగిపోయాయి. దీంతో ‘హనుమాన్’ కి థియేటర్స్ అడ్జస్ట్ చేయలేమని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు టీంకి చెప్పడం జరిగింది.
పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమా వస్తున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రేక్షకులు కచ్చితంగా పండక్కి పెద్ద సినిమాని చూడాలనుకుంటారు. ‘గుంటూరు కారం’ ఫలితం సంగతి పక్కన పెడితే.. ఆ సినిమాని మొదటి 3 రోజుల్లో చూడాలనుకునే ప్రేక్షకులు ఎక్కువ మంది ఉంటారు. మహేష్ బాబు ప్లేస్ లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నా పరిస్థితి ఇలానే ఉంటుంది.
అయితే దీనిని ‘హనుమాన్’ టీం సింపతీకి వాడేసుకుంది. ఇలాంటి వ్యవహారాల్లో హీరోలు జోక్యం చేసుకోకూడదు. కానీ తేజ సజ్జ చాలా సందర్భాల్లో మా సినిమాకి థియేటర్లు ఇవ్వడం లేదు అంటూ చెప్పడం జరిగింది. ‘హనుమాన్’ లో కూడా కంటెంట్ ఉంది కాబట్టి.. వాళ్ళ కామెంట్స్ చెల్లాయి.
సరే.. పండగ టైంలో అలాంటి సందర్భాలు మామూలే అని.. ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘మహేష్ బాబు సినిమాకి పోటీగా రావడం అనేది తప్పక జరిగింది, హిందీ రిలీజ్ డేట్ కోసం వేరే ఆప్షన్ లేకుండా పోయింది’ అని ఉన్నది ఉన్నట్లు చెబుతున్నాడు. కానీ హీరో తేజ సజ్జ మాత్రం ఇప్పటికీ ”హనుమాన్’ కి మాకు థియేటర్స్ ఇవ్వలేదు.. చాలా టీవీ షోలకు ప్రమోషన్స్ కి కూడా మమ్మల్ని పిలవలేదు’ అంటూ సింపతీ కబుర్లు చెబుతూనే ఉన్నాడు. ‘మిరాయ్’ ప్రమోషన్స్ లో కూడా ‘హనుమాన్’ స్ట్రగుల్స్ గురించి మీడియా అడక్కపోయినా చెబుతూనే ఉన్నాడు తేజ సజ్జ. మరి ‘మిరాయ్’ కి కూడా ఈ సింపతీ కబుర్లు వర్కౌట్ అవుతాయేమో చూడాలి.