నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్.. అప్పుడప్పుడు వివాదాస్పద విషయాలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన చెక్ బౌన్స్ కేసులో కోర్టు మెట్లెక్కారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి బండ్ల గణేష్ ఇచ్చిన రూ.1 కోటి 25 లక్షల చెక్.. బౌన్స్ అవ్వడంతో ఆయన కోర్టుని ఆశ్రయించాడు. విచారణకు హాజరు కావాలంటూ పలుసార్లు కోర్టు నుంచి ఆదేశాలు వెళ్లినప్పటికీ బండ్ల గణేష్ పట్టించుకోలేదు.
దీంతో ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు జడ్జి బండ్ల గణేష్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచాలని పోలీసులకు ఆదేశాలను జారీ చేశారు. దెబ్బకి దిగొచ్చిన ఆయన.. ఈరోజు కోర్టుకి హాజరయ్యారు. ఆయన కారు దిగి లాయర్లతో కలిసి కోర్టుకు వెళుతున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బండ్ల గణేష్ కి ఇలాంటి కేసులు కొత్తేమీ కాదు. ఆ మధ్య హీరో సచిన్ జోషి విషయంలో కోర్టు వరకు వెళ్లారు బండ్ల గణేష్.
అలానే కడప జిల్లాకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర 1కోటి 30 లక్షల రూపాయలు అప్పు తీసుకుని ఆయనకు తిరిగి చెల్లించలేదు. దీంతో మహేష్ ఫిర్యాదు చేయగా… విచారణకు హాజరు కావాలని బండ్ల గణేష్ కి చెప్పినా ఆయన వినలేదు. దీంతో కడపజిల్లా మెజిస్ట్రేట్ బండ్ల గణేష్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.