ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తెలుగు వెబ్ ఫిలిమ్ “భామా కలాపం”. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆహా యాప్ లో విడుదలైంది. సినిమా టీజర్ & ట్రైలర్ మంచి ఆసక్తిని రేకెత్తించాయి. మరి ఈ వెబ్ ఫిలిమ్ అదే స్థాయిలో ఉందో లేదో చూద్దాం..!!
కథ: అనుపమ మోహన్ (ప్రియమణి) ఓ సాధారణ గృహిణి. తనకు ఎంతో ఇష్టమైన వంటలు చేస్తూ యూట్యూబర్ గా సక్సెస్ ఫుల్ కెరీర్ ఎంజాయ్ చేస్తుంటుంది. కుటుంబం, యూట్యూబ్ చానల్ తోపాటు ఆమెకు ఉన్న మరో అలవాటు పక్కింట్లో, తన సొసైటీలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం. అలా తెలుసుకునే క్రమంలో తనకు తెలియకుండానే ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది అనుపమ.
అసలు ఇంట్లో వంటలు చేసుకునే అనుపమ ఏకంగా హత్య కేసులో ఎలా ఇరుక్కుంది? తన కుటుంబానికి ఎలాంటి హాని జరగకుండా ఎలా కాపాడుకుంది? అనేది “భామా కలాపం” కథాంశం.
నటీనటుల పనితీరు: నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ప్రియమణి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో వర్కింగ్ ఉమెన్ రోల్ లో ఆకట్టుకున్న ప్రియమణి ఈ చిత్రంలో సగటు గృహిణిగా అలరించింది. ఆమె పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి. వాటన్నిటినీ తన కళ్లలోనే పలికించింది ప్రియమణి. గృహిణిగా, బాధ్యతగల తల్లిగా, ఓపిక గల సతీమణిగా భిన్నమైన వేరియేషన్స్ ను ప్రదర్శించింది.
నాయర్ గా జాన్ విజయ్ కామిక్ సెన్స్ ఉన్న డాన్ రోల్ లో అలరించాడు. పనిమనిషిగా శరణ్య, పోలీస్ ఆఫీసర్ గా శాంతి రావులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ప్రియమణి తర్వాత ఫాదర్ డానియల్ గా “కేరాఫ్ కంచరపాలెం” కిషోర్ ఊహించని విధంగా ఆకట్టుకున్నాడు. అతడి క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది.
సాంకేతికవర్గం పనితీరు: ప్రొడక్షన్ డిజైన్ దగ్గర నుంచి, ఆర్ట్ వర్క్ & కెమెరా వర్క్ అన్నీ ప్రొజెక్ట్ వర్త్ కి తగ్గట్లుగా ఉన్నాయి.
దర్శకుడు అభిమన్యు కథను ఓ సాధారణ థ్రిల్లర్ గా మొదలుపెట్టి.. దానికి దేవుడు/నిజం కాన్సెప్ట్ ను అద్దిన విధానం బాగుంది. ముఖ్యంగా ఏసుక్రీస్తు జననాన్ని కథకు తగ్గట్లుగా ఎలివేట్ చేసిన విధానం అభినందనీయం. అయితే.. ఈ తరహా కథలకు చాలా ముఖ్యమైన ఎండింగ్ విషయంలో మాత్రం తడబడ్డాడు. క్లాసిక్ టచ్ కోసం ప్రయత్నించి బేసిక్ ఎండింగ్ ను మరిచాడు. హీరోయిన్ క్యారెక్టర్ కు మంచి ఎండింగ్ ఇచ్చాడు కానీ.. ఆ పాత్ర చుట్టూ తిరిగిన పాత్రలకు ఎండ్ ఏమిటనేది ప్రోపర్ గా ఎలివేట్ అవ్వలేదు.
అందువల్ల అర్ధాంతరంగా ముగుసినట్లుగా అనిపిస్తుంది. దర్శకుడిగా కంటే కథకుడిగా అభిమన్యు ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. చివరి 15 నిమిషాలను ఇంకాస్త చక్కగా డీల్ చేసి ఉంటే బాగుండేది. అప్పుడు ప్రేక్షకులకు కూడా ఒక కంప్లీట్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలిగేది.
విశ్లేషణ: ఒక థ్రిల్లర్ సినిమాకి కావాల్సిన అన్నీ అంశాలు పుష్కలంగా ఉన్న సినిమా “భామా కలాపం”. పరిపక్వత చెందిన ప్రియమణి నటన, ఒకే లొకేషన్ లో షూట్ జరిగినప్పటికీ.. ఎక్కడా బోర్ కొట్టించకుండా సాగిన కథనం కోసం ఈ వెబ్ ఫిలిమ్ ను హ్యాపీగా ఒకసారి చూసేయొచ్చు. కాకపోతే.. ఎండింగ్ ఇంకాస్త ప్రోపర్ గా ప్లాన్ చేసి ఉంటే ఇంకాస్త బెటర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఉండేది.
రేటింగ్: 3/5