సందేశాత్మక కథలతో కమర్షియల్ సినిమాలు తెరకెక్కించడంలో కొరటాల శివ దిట్ట. తొలి చిత్రం మిర్చిలో పగలు వీడాలని చెప్పిన డైరక్టర్ సెకండ్ సినిమా శ్రీమంతుడు సినిమాలో గ్రామాలను దత్తత తీసుకొని ఎంతోకొంత సేవ చేయాలనీ సూచించారు. శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో మహేష్ తో పాటు, ఇతర నటీనటులు కూడా ఊర్లను దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. అలాంటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీ భరత్ అను నేను. ఈ సినిమా ద్వారా కూడా కొరటాల మంచి సందేశాన్ని అందివ్వనున్నారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ చిత్రం ఫస్ట్ ఓత్(ఆడియో) నేడు రిలీజ్ అయి మహేష్ బాబు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
భరత్ పాత్రలో ఉన్న మహేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే విధానం విశేషంగా ఆకట్టుకుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి ప్రతిపక్షనేతగా తనదైన శైలిలో నవ్వులు పూయించనున్నారు. ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27 న రిలీజ్ కానుంది.