పెద్ద సినిమాల టికెట్ రేట్లు తెలంగాణలో ఒక విధంగా ఉంటే ఏపీలో మరో విధంగా ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో సినిమా టికెట్ రేట్లను తగ్గించాలని కామెంట్లు వ్యక్తమవుతుండగా ఏపీలో మాత్రం టికెట్ రేట్లను పెంచాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ఏపీలో కూడా పెరిగిన టికెట్ రేట్లు అమలులోకి రానున్నాయని సమాచారం అందుతోంది. అయితే బుక్ మై షో యాప్ లేదా ఇతర సినిమా టికెట్ల బుకింగ్ యాప్స్ నుంచి టికెట్లు బుక్ చేసుకోవాలంటే ప్రేక్షకులకు అదనపు భారం పడుతోంది.
ఇతర యాప్స్ తో పోలిస్తే బుక్ మై షో ద్వారానే టికెట్లను బుకింగ్ చేసుకునే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సమయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నైజాంలో బుక్ మై షోను బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా భీమ్లా నాయక్ సినిమాకు బుక్ మై షోలో టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం లేదు. కన్వేయెన్స్ ఫీ పేరుతో బుక్ మై షో 20 రూపాయల నుంచి 40 రూపాయలు వసూలు చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ తెలిపారు.
వరుసగా పెద్ద సినిమాలు రిలీజవుతున్న తరుణంలో ఈ నిర్ణయం వల్ల బుక్ మై షోకు ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ నిర్ణయం భీమ్లా నాయక్ కు మాత్రమే పరిమితమవుతుందో లేక తర్వాత పెద్ద సినిమాలకు కూడా అమలవుతుందో చూడాల్సి ఉంది. థియేటర్ల దగ్గరే భీమ్లా నాయక్ కు బుకింగ్స్ జరుగుతుండగా పవన్ అభిమానులు టికెట్లను బుకింగ్ చేసుకోవడానికి థియేటర్ల దగ్గర క్యూలైన్లలో నిలబడుతున్నారు.
భీమ్లా నాయక్ సినిమాకు థియేటర్ల దగ్గరే టికెట్లు తీసుకునే ఛాన్స్ ఉండటంతో పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని సమాచారం అందుతోంది. ఏపీలో కూడా టికెట్ రేట్లు పెరిగితే ఈ సినిమా కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా హక్కులు 110 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. పవన్ కు ఈ టార్గెట్ చిన్నదే కాగా ఈ సినిమాకు ఏ స్థాయిలో కలెక్షన్లు వస్తాయో చూడాలి.