రెండు, మూడు రోజులుగా ఎగ్జిబిటర్స్, బుక్ మై షో యాప్ వాళ్లకు మధ్య గొడవ జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో మాటలు వినిపించాయి. ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడిపై చాలా భారం పడుతుందని.. దానికి కారణంగా బుక్ మై షోపై నిషేధం విధించారట. మొన్నటివరకు ఎగ్జిబిటర్లు ఇదే మాటను పబ్లిక్ గా చెప్పారు. ఈరోజు ఈ వివాదం పరిష్కారమైనట్లు ఉంది. బుక్ మై షో ఓపెన్ హెసెసి చూస్తే.. మళ్లీ అదే రేటు.
కన్వీనెన్స్ పేరుతో బుక్ మై షో వసూలు చేస్తున్న రేటులో గతానికి, ఇప్పటికి పెద్దగా తేడా లేదు. అటుఇటుగా 13 శాతం నుంచి 14 శాతం ఛార్జ్ వసూలు చేస్తోంది బుక్ మై షో. ఈ మాత్రం దానికి యాప్ పై నిషేధం విధిస్తామని.. ప్రేక్షకుడిపై భారం తగ్గిస్తామంటూ సినిమా డైలాగ్స్ కొట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు ప్రేక్షకులు. కన్వీనెన్స్ పేరిట బుక్ బై షో వసూలు చేస్తోన్న మొత్తంలో కొంతభాగం తిరిగి ఎగ్జిబిటర్లకే వెళ్తుందనేది ఓపెన్ సీక్రెట్.
ఆ మొత్తం పెంచుకోవడం కోసం బుక్ మై షోపై ఇలా అప్రకటిత నిషేధాన్ని ఎగ్జిబిటర్లు విధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో సినిమా విడుదల సమయంలో ఇలా చేస్తే.. బుక్ మై షో తమ దారికొస్తుందనేది ఎగ్జిబిటర్ల ప్లాన్ అని టాక్. మొత్తానికి వారు వేసిన ప్లాన్ బాగానే వర్కవుట్ అయింది. బుక్ మై షో దారికొచ్చినట్లే ఉంది. అందుకే ‘భీమ్లానాయక్’ సినిమాకి బుక్ మై షోలో బుకింగ్స్ మొదలయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే బుకింగ్స్ మొదలైనట్లు తెలుస్తోంది. ఏపీలో ఇంకా బుక్ మై షో యాప్ లో ‘భీమ్లానాయక్’ కనిపించడం లేదు.