టాలీవుడ్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఎప్పుడొస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది అంటే… ఉమైర్ సంధు అని వ్యక్తి నుండి అని చెప్పొచ్చు. చాలా కాలంగా దుబాయికి చెందిన సెన్సార్ సభ్యుడు అని చెప్పే ఉమైర్ సంధు చాలా కాలంగా తెలుగు స్టార్ హీరోల సినిమాలకు సెన్సార్ రిపోర్ట్ అంటూ… ట్వీట్లు చేస్తుంటాడు. ఆ ట్వీట్లు చూసి అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతుంటారు. గతంలో చాలా సినిమాల విషయంలో సంధు ట్వీట్లు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కొన్నిసార్లు బలమైన హిట్ కొట్టాయి.
తాజాగా ఉమైర్ సంధు ‘భీమ్లా నాయక్’ గురించి ట్వీట్ చేశాడు. సినిమా అదిరిపోయింది అనే రేంజిలో ట్వీట్ చేశాడు. అయితే సినిమా ఇంతగా అదిరిపోయిందన్నా… పవన్ ఫ్యాన్స్ మాత్రం అతని మీద తెగ ఫైర్ అవుతున్నారు. దీనికి కారణం ‘అజ్ఞాతవాసి’ సినిమా కోసం ఉమైర్ సంధు చేసిన ట్వీట్లు, ఆ తర్వాత సినిమాకు వచ్చిన ఫలితమే ఇప్పుడు అభిమానుల ఆగ్రహానికి కారణం. అప్పుడు ఇలానే చెప్పావు, కానీ సినిమా పోయింది. ఇప్పుడు మళ్లీ అలానే చెబుతున్నావ్ అంటూ కోపం చూపిస్తున్నారు.
‘భీమ్లా నాయక్’ సినిమా గురించి అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. పవన్ కల్యాణ్ పోలీసు పాత్రలో చాలా రోజుల తర్వాత నటించడం, రానా లాంటి ప్రతినాయకుడు / నాయకుడుతో తలపడే సన్నివేశాలు ఉండటంతో సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాకు త్రివిక్రమ్ కూడా పని చేస్తుండటంతో సినిమా మీద ఇంకా అంచనాలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు వరకు వచ్చిన ప్రచార చిత్రాల్లో అదే కనిపించింది. దీంతో ఉమైర్ సంధు ట్వీట్‌కి ఓవైపు ఆనందపడుతున్నా, మరోవైపు ‘అజ్ఞాతవాసి’ విషయంలో సంధు ట్వీట్ బెడిసికొట్టడంతో అభిమానులు భయపడుతున్నారు.
అయితే సినిమా షూటింగ్ శనివారం పూర్తయిన నేపథ్యంలో అసలు దుబాయి సెన్సార్ బోర్డుకి సినిమా సెన్సార్‌కి వెళ్లిందా? అసలు ఉమైర్ ట్వీట్లు.. సినిమా చూసే పెట్టాడా? అనేది ప్రశ్నగా మిగిలింది. సినిమాను ఫిబ్రవరి 25న కానీ, ఏప్రిల్ 1న కానీ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఫిబ్రవరి 25న విడుదల చేయాలంటే ఏపీలో టికెట్ రేట్ల సమస్య తేలాలి అనేది బయటకు చెప్పని మాట.