మహాశివరాత్రి సందర్భంగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్ కి ముహూర్తం పెట్టుకోవడంతో థియేటర్ల పంపకం చాలా రోజుల ముందే జరిగిపోయింది. నెల క్రితం అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయి. అయితే అప్పటికి ఎక్కువ అంచనాలు శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’ సినిమాపైనే ఉన్నాయి. టాలెంటెడ్ హీరో, పెద్ద బ్యానర్ లో తెరకెక్కిన సినిమా. బడ్జెట్ కూడా ఎక్కువ కావడంతో.. ఎక్కువ థియేటర్లు ‘శ్రీకారం’కి దక్కాయి.
పెద్ద నగరాల్లో ‘జాతిరత్నాలు’ సినిమాకి స్క్రీన్లు బాగా దక్కాయి కానీ బి, సి సెంటర్లలో మాత్రం ‘శ్రీకారం’ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చారు. ‘గాలి సంపత్’ సినిమాకి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే థియేటర్లు ఇచ్చారు. అనీల్ రావిపూడి స్క్రీన్ ప్లే అందించిన సినిమా కావడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. దిల్ రాజు అండగా నిలవడంతో ఈ సినిమాకి మంచి స్క్రీన్లు దక్కాయి. అయితే రిలీజైన తర్వాత ‘జాతి రత్నాలు’ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగాయి.
‘శ్రీకారం’, ‘గాలి సంపత్’ సినిమాను ఈ సినిమా ముందు నిలబడలేకపోయాయి. ‘జాతి రత్నాలు’ సినిమా టాప్ లో నిలిచింది. ‘శ్రీకారం’ ఆ తరువాతి స్థానాన్ని దక్కించుకుంది. రెండో రోజు కూడా ‘జాతి రత్నాలు’ సినిమాకి టికెట్లు దొరకని పరిస్థితి. ఇప్పుడు ఈ సినిమాకి థియేటర్లు పెంచినా.. మంచి ఆక్యుపెన్సీ వచ్చేలా ఉంది. కానీ ముందు జరిగిన ఒప్పందాల వలన ఏమీ చేయలేని పరిస్థితి. సినిమాకి మంచి డిమాండ్ ఉన్నా.. థియేటర్లు మాత్రం లేవు. దీని ఓవర్ ఫ్లోస్ మిగిలిన రెండు సినిమాలకు కలిసిరావడం విశేషం.