లాక్ డౌన్ సమయంలో చిత్ర పరిశ్రమ కుదేలు కాగా నిర్మాతలు భారీగా నష్టపోయారు. కోట్లు పెట్టిన నిర్మించిన చిత్రాలు విడుదలకు నోచుకోలేకపోతున్నాయి. కొన్ని చిత్రాల చిత్రీకరణ మధ్యలో ఆగిపోయింది. దీనితో నిర్మాతల పెట్టుబడిపై వడ్డీల భారం పడడంతో పాటు, నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది. మరో రెండు నెలలకు కూడా థియేటర్స్ తెరచుకొనే పరిస్థితి కనిపించడం లేదు. దీనితో తమిళ నిర్మాతల సంఘం ఓ నిర్ణయం తీసుకుందని సమాచారం. నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల పారితోషికాలలో 50% కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారట.
తమిళ ప్రొడ్యూసర్స్ సంఘం తీసుకున్న ఈ నిర్ణయం వలన తమిళ నటుల రెమ్యూనరేషన్స్ లో భారీ కోత పడడం ఖాయం. రజని, కమల్, విజయ్, అజిత్, సూర్య, విక్రమ్ వంటి తమిళ నటులు కోలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారు. మరి ఈ స్టార్ హీరోలందరి చెల్లింపులలో భారీ కోత పడనుంది. సదరు స్టార్ హీరోలందరూ భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నారు. మరి ప్రొడ్యూసర్స్ తీసుకున్న ఈ నిర్ణయానికి స్టార్ హీరోల స్పందన ఏమిటనేది తెలియదు.
ఇక తమిళ నాడులో కరోనా వైరస్ వ్యాప్తి దారుణంగా ఉంది. దేశంలోనే అత్యధిక కరోనా రోగులు కలిగిన రాష్ట్రంగా తమిళనాడు ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది .చాలా వరకు సంస్థలు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. కాబట్టి అక్కడ చిత్ర పరిశ్రమ సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది.