శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన రెండో చిత్రం ‘గుంజన్ సక్సేనా – ది కార్గిల్ గర్ల్’. జాన్వీ నటించిన మొదటి చిత్రం ‘దడక్’ తో హిట్ అందుకుంది కాబట్టి.. రెండో చిత్రం పై కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి. లాక్ డౌన్ కారణంగా నేరుగా ఓటిటి(నెట్ ఫ్లిక్స్) లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇది ఒక బయోపిక్ అన్న సంగతి దాదాపు అందరికీ తెలిసిందే. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న గుంజన్ సక్సేనా…ఆ యుద్ధంలో గాయపడిన సైనికులను రక్షించింది. దీంతో ఆమె ధైర్యసాహసాలకు అలాగే సేవలకు గాను ‘శౌర్య వీర్’ పురస్కారం కూడా దక్కింది.
ఆ ఎపిసోడ్ నే ‘గుంజన్ సక్సేనా – ది కార్గిల్ గర్ల్’ పేరుతో సినిమాగా తీసారు. జాన్వీ కపూర్.. గుంజన్ సక్సేనా.. పాత్రను పోషించింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ చిత్రం పై కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ” ‘గుంజన్ సక్సేనా – ది కార్గిల్ గర్ల్’ చిత్రం ఎయిర్ ఫోర్స్ పై నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగించేలా ఉందంటూ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థ.. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు లేఖ రాసింది. ‘ఈ చిత్రాన్ని మొదలుపెట్టినప్పుడు దర్శకనిర్మాతలు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐ.ఎ.ఎఫ్) గౌరవ మర్యాదలు పెంచేలా తీస్తామని.. అలాగే భవిష్యత్ తరాలకు ఆదర్శవంతంగా ఉండేలా చిత్రీకరిస్తామని చెప్పుకొచ్చారు.
అయితే సినిమా ట్రైలర్లో కొన్ని సీన్స్ మరియు డైలాగులు అభ్యంతరంగా ఉన్నాయంటూ మా దృష్టికి వచ్చింది. దాంతో మేము కూడా ఆ ట్రైలర్ ను చూడగా మాకు కూడా అలానే అనిపించింది. గుంజన్ సక్సేనా పాత్రలో నటించిన జాన్వీ కపూర్ కు భారీ హైప్ ఏర్పడేలా చెయ్యడం కోసం నిర్మాతలు ఐ.ఎ.ఎఫ్(ఇండియన్ ఎయిర్ ఫోర్స్) ను నెగిటివ్ గా చూపించాయి. అంతేకాదు లింగ భేదాన్ని రేపే సన్నివేశాలు కూడా ఉన్నాయి.వెంటనే ఆ సన్నివేశాన్ని డిలీట్ చెయ్యాలి. ఐ.ఎ.ఎఫ్ గౌరవ మర్యాదలను మంటకలిపించేలా అవాస్తవాలు చూపించకూడదు” అంటూ ఆ లేఖలో పేర్కొంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థ.