కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాలు, టీవీ షూటింగ్ లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ఉండడంతో ఇండస్ట్రీలో ఎలాంటి షూటింగ్ లు జరగడం లేదు. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కూడా పలుచోట్ల వాయిదా పడింది. అయితే స్టార్ హీరో మోహన్ లాల్ హోస్ట్ చేస్తోన్న మలయాళం బిగ్ బాస్ మూడో సీజన్ ఇదివరకే మొదలైంది. దీన్ని మధ్యలో ఆపడానికి ఇష్టపడని యాజమాన్యం లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి సీక్రెట్ గా షూటింగ్ కొనసాగిస్తున్నారు.
దీంతో ఈ షోలో పని చేసే ఎనిమిది మంది సిబ్బందికి కరోనా వచ్చింది. అయినప్పటికీ షూటింగ్ వాయిదా వేయలేదు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో వారు వెంటనే చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో బిగ్ బాస్ సెట్ కు వెళ్లి షూటింగ్ ఆపేశారు. హౌస్ మేట్స్ ను అక్కడ నుండి హోటల్ కు పంపించారు. బిగ్ బాస్ సెట్ ను మూసివేశారు. మలయాళ బిగ్ బాస్ మూడో సీజన్ 14 మంది కంటెస్టెంట్ లతో మొదలైంది. ఫిబ్రవరి నుండి ప్రసారమవుతోన్న ఈ షో ఇప్పటికే 95 రోజులు పూర్తి చేసుకుంది.
ఈ మధ్యనే షోను మరో రెండు వారాలు పొడిగించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో షూటింగ్ ను కంటిన్యూ చేశారు. దీంతో పోలీసులు అడ్డుకొని టెక్నీషియన్స్ ను సెట్ నుండి పంపించేశారు. అనంతరం సెట్ ను సీల్ చేసినట్లు అధికారులు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం విధించిన రూల్స్ ను అతిక్రమించినందుకు బిగ్ బాస్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఇంత జరిగినప్పటికీ బిగ్ బాస్ షో కొనసాగుతుందని.. జూన్ 4న గ్రాండ్ ఫినాలే నిర్వహించాలని యాజమాన్యం భావిస్తోందట!