బిగ్‌బాస్ ఇంట్లోకి రావడానికి అవకాశం వచ్చిందంటే చిన్న విషయం కాదు. ఎన్నో ఆలోచనలు, సమీకరణాలు, తర్జన భర్జనలు ఉంటాయి. అలా వచ్చేవాళ్లకు ఇన్‌స్టంట్‌గా స్టార్‌డమ్ వచ్చేస్తుంది. అందుకే ఒక్క వారం ఉండి వెళ్లిపోయానా వాళ్లకు ఆ పేరు కొనసాగుతుంది. అలాంటి ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చి సిల్లీ కారణాలు చెబితే ఏం బాగుంటుంది. కానీ ఈ సీజన్‌లో నామినేషన్ విషయంలో అలాంటి రీజన్స్ కనిపిస్తున్నాయి. సోమవారం జరిగిన నామినేషన్ ప్రాసెస్ చూస్తే ఇదే కనిపిస్తోంది.
ఫలానా వ్యక్తి ఇంట్ల తప్పు చేశాడు, ఫలానా వ్యక్తి వల్ల ఇంటి అట్మాస్పియర్ చెడిపోతోంది, ఫలానా వ్యక్తి ఇంటికి సరిపడడు లాంటి కారణాలు మనం గతంలో విన్నాం. వీటన్నింటికి మించి ఆ వ్యక్తి తనకు ఇంట్లో గట్టి పోటీ అనిపిస్తే నామినేట్ చేస్తారు. ఈ మాటలేవీ నామినేషన్‌లో వినిపించడం లేదు. నిన్న వినిపించలేదు కూడా. దీనికి బదులు చిన్న పిల్లలు చెప్పే రీజన్స్ వచ్చి చేరాయి. కొందరు ఎంత సిల్లీ రీజన్స్ చెబుతున్నారంటే… ఇవి కూడా కారణాలేనా అని అనిపించేంత.
సోమవారం జరిగిన నామినేషన్ల సంగతి చూస్తే… తొలుత చెప్పుకోవాల్సిన ఫన్నీ పాయింట్ దివి గురించి. లాస్య వండిన పప్పు వల్ల ఇంట్లో వాళ్లకు మోషన్స్ అవుతున్నాయని నామినేట్ చేసింది. ఇక కిచెన్ క్లీన్ ఉంచడం లేదంటూ దివిని లాస్య నామినేట్ చేసింది. సేఫ్ గేమ్ ఆడుతున్నావ్ అన్నందుకు మోనాల్‌ను అవినాష్ నామినేట్ చేశాడు.
ఇక పక్కవాళ్లను ఏదో అన్నారంటూ నామినేట్ కూడా చేస్తున్నారు. సోహైల్-మెహబూబ్ విషయంలో అమ్మ రాజశేఖర్ విధానం నచ్చక మాస్టర్‌న అఖిల్ నామినేట్ చేశాడు. ఆ విషయం వాళ్లిద్దరూ చూసుకుంటారు కదా. వాళ్లకి లేని బాధ ఈయనకెందుకో. స్వాతి దీక్షిత్‌ను గత వారం నామినేట్ చేశారు అంటూ ఈ వారం మాస్టర్‌ను నోయల్ నామినేట్ చేశాడు.
చదివారుగా నామినేషన్ కారణాలు… వీటిలో ఒక్కటైనా సీరియస్‌గా ఉందా చెప్పండి. కోట్ల మంది చూస్తున్న కార్యక్రమంలో ఇవేనా కారణాలు చెప్పేది. మాటలతో తేలిపోయవాటికి, నామినేషన్లు చేసి సీన్ క్రియేట్ చేయడం ఎందుకు అని నెటిజన్లు అడుగుతున్నారు. వీటికి బిగ్‌బాస్, బిగ్‌బాస్ టీమ్ ఎలాగూ సమాధానం చెప్పదు. కనీసం వీకెండ్‌లో నాగార్జునైనా ఈ టాపిక్ మాట్లాడతాడేమో చూడాలి.