మలయాళ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నారు మోహన్ లాల్. ఆయన సినిమాలకు వంద కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తుంటాయి. అలాంటిది ఆయన నటించిన లేటెస్ట్ సినిమాకి పబ్లిసిటీ ఖర్చులు కూడా రాకపోవడం షాకింగ్ గా ఉంది. మోహన్‌లాల్ హీరోగా షాజీ కైలాష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎలోన్’. రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విమర్శకుల నుంచి దారుణమైన విమర్శలు వచ్చాయి.
అసలు ఇలాంటి కథను మోహన్ లాల్ ఎలా ఓకే చేశారా..? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమా కేరళలో రెండు రోజుల్లో కేవలం రూ.53 లక్షల గ్రాస్ ను మాత్రమే వసూలు చేసింది. దీనిలో తొలిరోజు రూ.43 లక్షల గ్రాస్ కాగా.. రెండోరోజు కేవలం రూ.10 లక్షలు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. మూడు రోజుల్లో ఈ సినిమాకి కోటి రూపాయల కలెక్షన్స్ వస్తాయో లేదో కూడా డౌటే. ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించారు.
ప్రింట్, పబ్లిసిటీ ఖర్చులతో కలుపుకొని రూ.2.5 కోట్లు బడ్జెట్ అయిందట. ఈ చిన్న మొత్తాన్ని వసూలు చేయడంలో కూడా ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. మోహన్ లాల్ కెరీర్ లోనే ఇదొక బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలే ఛాన్స్ ఉంది. ఇలాంటి సినిమాతో మోహన్ లాల్ కొత్త ఏడాదిని ప్రారంభించడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. అసలు ఈ సినిమాను థియేటర్ లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మోహన్ లాల్ సినిమా కంటే ఒక్కరోజు ముందు కేరళలో రిలీజైన ‘పఠాన్’ సినిమా అక్కడ ఎక్కువ వసూలు చేసింది. ‘పఠాన్’ సినిమా తొలిరోజు కేరళలో రూ.1.95 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఒక బాలీవుడ్ సినిమాకి కేరళలో ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయంటే మాములు విషయం కాదు. మూడు రోజుల్లో రూ.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ‘పఠాన్’. మలయాళ స్టార్ హీరో సినిమా కాదని.. బాలీవుడ్ సినిమాను కేరళ ఆడియన్స్ ఆదరిస్తున్నారంటే ‘ఎలోన్’ సినిమా పరిస్థితేంటో అర్ధమవుతోంది.