శర్వానంద్ ష్యూర్ షాట్ హిట్ వచ్చి చాలా ఏళ్లు అయింది. మధ్యలో వచ్చిన సినిమాలకు విజయం వచ్చినా అది ఆశించినట్లుగా రాలేదు. దీంతో ఆయన సినిమా వస్తోంది అంటే సరైన బజ్ కూడా రాలేదు. అంతెందుకు ఇప్పుడు వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాకు కూడా సరైన ప్రచారం చేయలేదు. అయితే ఆ సినిమాకు మంచి ఫలితమే రావడంతో శర్వానంద్ మంచి హుషారుగా ఉన్నారు. సంక్రాంతికి వచ్చి హ్యాట్రిక్ కొట్టడంతో వచ్చే సంక్రాంతికి సినిమా తీసుకురావడానికి రెడీ అవుతున్నారు.
ఆ సినిమా సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు రెడీగా ఉన్న సినిమా సంగతి చూద్దాం. నిజానికి ఇప్పుడు మనం ‘బైకర్’ సినిమా గురించే మాట్లాడాలి. ఆ సినిమాను గతేడాది ఆఖరులో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ప్రచారం కూడా షురూ చేశారు. అయితే ఏమైందో ఏమో ఆ సినిమాను వాయిదా వేసేసి.. ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాను బయటకు తీశారు. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్, వినోదం ఉండటంతో సంక్రాంతి సరైన సీజన్ అని దర్శకనిర్మాతలు అనుకున్నారు.
ఇప్పుడు ఈ సినిమా విజయం సాధించడంతో ఇప్పుడు ‘బైకర్’ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఆ సినిమా లుక్, కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉండటంతో కాస్త బజ్ వచ్చింది. అయితే వాయిదా పడటంతో ఎందుకబ్బా.. కంటెంట్ మీద ఏమైనా డౌటా అనే ప్రశ్న మొదలైంది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఇబ్బందులు ఉండటంతో ఆపాం అని టీమ్ చెబుతున్నా.. అవునా అని అనుకున్నారంతే. అయితే ఇప్పుడు ‘నారీ నారీ నడుమ మురారి’ విజయం ‘బైకర్’కి స్పీడ్ బ్రేకర్‌లను తప్పించింది.
మరిప్పుడు ఆ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఆయన ఇప్పటికే ‘లూజర్’, ‘ఎక్కడికి ఈ పరుగు’ వెబ్‌సిరీస్‌లతోపాటు ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా తెరకెక్కించారు.
