ఎప్పుడూ చెప్పుకునే మాటనే.. ఇండియన్ సినిమా అంటే మేమే అని కాలర్ ఎగరేసి ఎచ్చులకు పోయిన బాలీవుడ్.. ఇప్పుడు కాస్త సల్లబడింది. కాస్త కానీ పూర్తిగానే సల్లబడింది. సౌత్ సినిమా నుండి వస్తున్న పోటీని తట్టుకోవడంలో, అక్కడి ప్రేక్షకులకు ఇవ్వాల్సిన కంటెంట్ విషయంలో విఫలమవుతూ వస్తోంది. దీంతో ఎన్ని రకాల సినిమాలు చేసినా, ఆఖరికి సౌత్ సినిమాలను అక్కడికి తీసుకెళ్తున్నా విజయాలు అయితే రావడం లేదు. దీంతో బాలీవుడ్ తీరును అక్కడి వాళ్లే తప్పు పడుతూ వస్తున్నారు. తాజాగా మరొకరి గొంతు లేచింది.
హిందీ చిత్ర పరిశ్రమను చూస్తుంటే ఆందోళనగా ఉందని ఇప్పటికే చాలామంది నటులు, దర్శకులు బాహాటంగానే విమర్శించారు. ఒకప్పుడు వరుస సినిమాలు చేయడమే కాదు, తీసిన ప్రతి సినిమాతోను దాదాపు విజయాలు అందుకున్న హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) తొలుత గొంతెత్తాడు. బాలీవుడ్‌లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని, బాలీవుడ్ నటుల ఆలోచనలో కూడా మార్పు రావాల్సి ఉందని ఓ ఓటీటీ టాక్ షోలో పబ్లిక్‌గానే రియాక్ట్ అయి కామెంట్లు చేశారు. మొన్నీమధ్యే ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) కూడా ఇలానే మాట్లాడారు.
ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం (John Abraham) కూడా అదే అంటున్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాల గురించి మాట్లాడారు. హిందీ చిత్ర సీమలో తెరకెక్కే సినిమాలపై సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. హిందీ పరిశ్రమ గందరగోళంగా ఉంది. ఈ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా నేను ఆందోళనగా ఉన్నాను. సినిమాల విషయంలో భిన్నంగా ప్రయత్నించాల్సిన సమయం వచ్చింది అని కామెంట్ చేశారు.
బాలీవుడ్‌లో కొత్తగా ప్రయత్నించాలనుకునే వారు తక్కువమంది ఉన్నారు. నేను కమర్షియల్ హీరోని అలా అని కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకూడదు. భిన్నమైన కథలను ఎంచుకోవాలి. అలా జరగాలంటే స్వేచ్ఛ ఉండాలి. అలాంటప్పుడే పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది అని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా బాలీవుడ్ మారుతుందేమో చూడాలి.