2019లో మలయాళంలో మాత్రమే విడుదలైన “లూసిఫర్” మిగతా భాషల కమర్షియల్ సినిమాలు కుళ్లుకునే స్థాయిలో తెరకెక్కి అశేషమైన రెస్పాన్స్ అందుకుంది. మోహన్ లాల్ (Mohanlal) స్క్రీన్ ప్రెజన్స్ & పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) డైరెక్షన్ కి అందరూ ఫిదా అయిపోయారు. మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi) అయితే ఏకంగా “గాడ్ ఫాదర్” (Godfather) అంటూ రీమేక్ కూడా చేశారు. దాంతో ఆ సినిమా సీక్వెల్ “ఎంపురాన్”కి (L2: Empuraan) భీభత్సమైన క్రేజ్ పెరిగింది. అందుకే పాన్ ఇండియన్ సినిమాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. మరి హైప్ ను అందుకోవడంలో “ఎంపురాన్” & టీమ్ సక్సెస్ అయ్యిందా లేదా అనేది చూద్దాం..!!
కథ: జతిన్ రాందాస్ (టోవినో థామస్ (Tovino Thomas)ను ముఖ్యమంత్రిని కుర్చీలో కూర్చోబెట్టి కేరళ నుండి మాయమవుతాడు స్టీఫెన్ (మోహన్ లాల్). అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో IUF పార్టీ చీలుతుంది. జతిన్ డబ్బు, అధికారం కోసం ASM పార్టీతో కలిసి భజరంగీ (అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) IUF-PKR పార్టీని స్థాపిస్తాడు. దాంతో కేరళ రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడుతుంది.
ఈ సంక్షోభాన్ని ఆపగల సత్తా ఉన్న ఏకైక వ్యక్తి స్టీఫెన్ అలియాస్ అబ్రామ్ ఖురేషినీ కేరళ పిలిపించడానికి గోవర్ధన్ (ఇంద్రజిత్ సుకుమారన్) (Indrajith Sukumaran) ఏం చేశాడు? స్టీఫెన్ ఈ సమస్యలను ఎలా ఎదిరించాడు? అనేది “ఎంపురాన్: లూసిఫర్ 2” కథాంశం.
నటీనటుల పనితీరు: లూసిఫర్ మొదటి పార్ట్ లో కేవలం ప్రేక్షకురాలిగా మిగిలిపోయిన మంజు వారియర్ (Manju Warrier), సెకండ్ పార్ట్ లో మంచి పాత్రలో అలరించింది. ప్రియదర్శిని రాందాస్ గా ఆమె పోషించిన పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ తెలుగు రాష్ట్రాల్లోని కొంతమంది ఫీమెల్ పొలిటీషియన్స్ ను గుర్తుచేయడం ఖాయం.
మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజన్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది. 64 ఏళ్ల వయసులోనూ చురుగ్గా యాక్షన్ సీక్వెన్స్ సీన్స్ చేస్తూ తన అభిమానులను సంతుష్టపరిచాడు. అయితే.. అతడి పాత్ర ఆర్క్ కి, ఆ పాత్ర చుట్టూ అల్లిన సన్నివేశాలు & డ్రామాకి అస్సలు సింక్ అవ్వలేదు. దాంతో.. ఆ పాత్ర తాలూకు హీరోయిజాన్ని పెద్దగా ఎంజాయ్ చేయలేం.
జయీద్ మసూద్ గా పృథ్వీరాజ్ సుకుమార్ పాత్ర ఫస్ట్ పార్ట్ లో సర్ప్రైజ్ ఎలిమెంట్, అయితే.. సెకండ్ పార్ట్ లో అ పాత్ర తాలూకు బ్యాక్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మరీ ఎక్కువ టైమ్ తీసుకున్నారు. అలాగే.. సదరు రివెంజ్ తీసుకునే సీక్వెన్స్ కూడా అంతగా పండలేదు. ఆ కారణంగా ఆ క్యారెక్టర్ తాలూకు జర్నీతో పెద్దగా కనెక్ట్ అవ్వలేం.
ఫస్ట్ పార్ట్ లో చాలా కీలకపాత్ర పోషించిన టోవినో థామస్ ను చాలా చిన్న క్యారెక్టర్ కు పరిమితం చేయడం వల్ల సినిమాకి ఆ క్యారెక్టర్ ఎలాంటి ప్లస్ పాయింట్ గా నిలవలేకపోయింది. అయితే.. పృథ్వీరాజ్ సుకుమారన్ పరభాషా నటులను ఎంపిక చేసుకున్న విధానం సినిమాకి అథెంటిసిటీ యాడ్ చేసింది.
సాంకేతికవర్గం పనితీరు: దీపక్ దేవ్ (Deepak Dev) నేపథ్య సంగీతం, పాటలు తెలుగు వెర్షన్ వరకు ఏమాత్రం వర్కవుట్ అవ్వలేదు. ముఖ్యంగా.. ప్రీక్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కి ఇచ్చిన ఫిర్ జిందా పాట అయితే ఎప్పడు అయిపోతుందా అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు.
సుజీత్ వాసుదేవన్ (Sujith Vaassudev) సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం ఇంటర్నేషనల్ లెవల్లో ఉంది. ముఖ్యంగా కలర్ టోన్ & గ్రేడింగ్ విషయంలో తీసుకున్న కేర్ మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో కీరోల్ ప్లే చేసింది. అన్నిటికీ మించి యాక్షన్ బ్లాక్ ను వైడ్ యాంగిల్ షాట్స్ లో ప్రాజెక్ట్ చేసిన విధానం బాగుంది.
ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయి. కాస్ట్యూమ్స్ నుంచి సెట్ వర్క్ వరకు అన్నీ హై స్టాండర్డ్ లోనే ఉన్నాయి. అయితే.. రచయిత మురళీ గోపి చాలా లూప్ హోల్స్ వదిలేశాడు. పాన్ వరల్డ్ లెవల్లో రాసుకున్న కథలో ఎమోషన్ మిస్ అయ్యింది. ఆ కారణంగా అసలు సినిమాకి ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు.
దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ స్టైలిష్ గా సినిమాను ప్రొజెక్ట్ చేయడం కోసం పడిన శ్రమ, కథనంపై పెట్టలేదు. సినిమా మొదలైన 50 నిమిషాల వరకు మోహన్ లాల్ కనిపించకపోవడం, ఇంటర్వెల్ బ్యాంగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటివన్నీ సినిమా నుండి ప్రేక్షకుడు డిస్కనెక్ట్ అయ్యేలా చేశాయి. ఇక సెకండాఫ్ లో రివెంజ్ సీక్వెన్స్ కి ఫీల్డ్ చేసిన సీన్స్ అన్నీ చాలా అసహజంగా ఉంటాయి. ఏమాత్రం దానికా ఇదంతా అనిపిస్తుంది. ఓవరాల్ గా దర్శకుడిగా స్టైలింగ్ వరకు కాస్త పర్లేదు అనిపించుకున్నాడు కానీ.. ప్రేక్షకుల్ని మాత్రం మెప్పించలేకపోయాడు.
విశ్లేషణ: పార్ట్ 1లో స్టీఫెన్ ఎవరు అనేది తెలియదు, అందువల్ల అతడేం చేసినా జనాలు ఆశ్చర్యపోతుంటారు. కానీ.. అబ్రామ్ ఖురేషి అతడే అని రివీల్ చేసిన తర్వాత అతడి స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. అందువల్ల సెకండ్ పార్ట్ లో అతడు చేసే పనులన్నీ డిగ్రీ పాసైనోడు 7వ తరగతి బోర్డ్ పరీక్షలు అటెండ్ అవుతున్నట్లు ఉంటుంది. బిలీవబిలిటీ అనేది తగ్గిపోవడం, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో “ఎంపురాన్: లూసిఫర్ 2” చతికిలపడింది అనే చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా చర్చ్ కి వెళ్ళేవాళ్ళు లేదా బైబిల్ చదివే అలవాటు ఉన్నవారికి మాత్రమే అర్థమయ్యేటువంటి సువార్త ప్రభోదనలు సినిమాలు మరీ ఎక్కువగా ఉండడం కూడా చిన్నపాటి డిస్కనెక్టివిటీ క్రియేట్ చేసింది. ఓవరాల్ గా ఫస్ట్ పార్ట్ స్థాయిలో లేక, సెకండ్ పార్ట్ తో ప్రేక్షకులను అలరించలేక ఇబ్బందిపడ్డాడు దైవపుత్రుడు ఎంపురాన్.
ఫోకస్ పాయింట్: ఆకట్టుకోలేకపోయిన దైవపుత్రుడి ప్రపంచ పర్యటన!
రేటింగ్: 2/5