మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణతో ఓ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మే నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తరువాత బోయపాటి ఎవరితో సినిమా చేయబోతున్నాడనే విషయంలో మెగాహీరో పేరు వినిపిస్తోంది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా బోయపాటి శ్రీను ఓ సినిమా చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ దిశగా చర్చలు మొదలయ్యాయి. బోయపాటికి మెగా కాంపౌండ్ లో సినిమాలు తీయడం కొత్తేమీ కాదు.
గతంలో అల్లు అర్జున్ హీరోగా ‘సరైనోడు’ సినిమా తీశాడు. ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇక రామ్ చరణ్ తో తీసిన ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ అయింది. ఈ సినిమా విషయంలో నెటిజన్లు బోయపాటిని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. పలు మీమ్స్ తో సోషల్ మీడియాలో ఆడేసుకున్నారు. రామ్ చరణ్ స్వయంగా క్షమించమంటూ ఫ్యాన్స్ కి ఓ లేఖ రాశాడు. అందులో చరణ్ ప్రస్తావించిన విషయాలు బోయపాటిని హర్ట్ చేశాయి.
చరణ్ అలా లేఖ రాసిన తరువాత ఇక మెగా కాంపౌండ్ లో బోయపాటి సినిమా కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు బోయపాటి. హీరోల్లో మాస్ యాంగిల్ ని ఎలివేట్ చేసే బోయపాటి సాయి ధరమ్ తేజ్ ని ఎలా చూపిస్తాడో చూడాలి. ఈ కాంబినేషన్ ఈ ఏడాది చివరి నుండి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.