కొంతకాలంగా హిట్టు లేక అల్లాడుతున్న బాలీవుడ్ ను ‘బ్రహ్మాస్త్ర’ కొంతవరకు ఆదుకుంది అనే చెప్పాలి. సోసియో ఫాంటసీ మరియు అడ్వెంచరస్ మూవీగా రూపొందిన ‘బ్రహ్మాస్త్ర’ సెప్టెంబర్ 9న రిలీజ్ అయ్యింది. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. అయితే 5 ఏళ్ల తరబడి తీసిన ఈ సినిమాకు రూ.500 కోట్ల బడ్జెట్ పైనే అయ్యింది అంటూ బి టౌన్ కోడై కూస్తోంది. వారి అనాలిసిస్ ప్రకారం ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వనట్టే లెక్క.
అంతేకాదు ఈ మూవీని డిజాస్టర్ గా కూడా వారు పేర్కొంటున్నారు. ఈ సినిమా నష్టాలు తీర్చే బాధ్యతను హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్ తీసుకున్నట్లు కూడా ప్రచారం మొదలైంది. ఈ చిత్రానికి నష్టాలు రావడంతో వారు తమ పారితోషికాలు త్యాగం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పై దర్శకుడు అయాన్ ముఖర్జీ క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. “చాలా మంది వ్యక్తిగత త్యాగాల వల్ల ఈ చిత్రాన్ని రూపొందించడం వీలైంది అనే మాట వాస్తవం.
రణభీర్, అలియా ఈ చిత్రం కోసం తీసుకున్న పారితోషికం వెనక్కి ఇచ్చేసారు అన్నది అసత్య ప్రచారం. నిజానికి పార్ట్ 1 కి గాను రణబీర్ ఎటువంటి పారితోషికం తీసుకోలేదు. ఇక హీరోయిన్ అలియా భట్ ఈ ప్రాజెక్టులో 2014లో జాయిన్ అయ్యింది. ఇప్పుడు ఆమె తీసుకుంటున్న పారితోషికాన్ని పోల్చి చూస్తే ‘బ్రహ్మాస్త్ర’ కి ఆమెకు ఆఫర్ చేసిన పారితోషికం చాలా తక్కువ.
పైగా ఆమె నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించింది” అంటూ చెప్పుకొచ్చాడు అయాన్ ముఖర్జీ. అలాగే రణబీర్ మాట్లాడుతూ.. ‘ ఈ చిత్రానికి నేను ఎటువంటి పారితోషికం తీసుకోలేదు. కానీ ఈ చిత్రం వల్ల నేను చాలా పొందాను. చాలా నేర్చుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.