మలయాళం సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి చేస్తున్న ప్రయోగాత్మక చిత్రాలు వేరే భాషల హీరోలు రీమేక్ చేసుకుంటే చాలా ఈజీగా బ్లాక్ బస్టర్స్ కొట్టేయొచ్చు. ఈ మాట నేను చెబుతున్నది కాదు.. ‘పొరుగింటి పుల్లకూర రుచి’ అన్నట్టు పక్క భాషల సినిమాలను ఎక్కువగా పొగిడే జనాలది. వాళ్ళ దృష్టిలో మమ్ముట్టి స్టోరీ సెలక్షన్, ఆయన నటన సూపర్. వాస్తవానికి లెజెండరీ యాక్టర్ కాబట్టి మమ్ముట్టి నటనకి పేరు పెట్టాల్సిన అవసరం లేదు.
కానీ అతనితో పోల్చి తెలుగు హీరోలను తక్కువ చేయడం తప్పుడు. సరే ఇక అసలు విషయానికి వస్తే.. ఇటీవల మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’ సినిమా రిలీజ్ అయ్యింది. ఇది తెలుగులో రిలీజ్ అవ్వకుండానే మలయాళం వెర్షన్ చూసేసి ‘ఆహా, ఓహో అద్భుతం’ అని పొగిడిన వారి సంఖ్య ఎక్కువే. అక్కడితో ఆగలేదు ‘ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయండి’ అంటూ సోషల్ మీడియాలో చాలా మంది రిక్వెస్ట్ లు కూడా పెట్టారు.
మొత్తానికి ఈ (Bramayugam) సినిమాని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అంటూ చెప్పినవాళ్ళే. కానీ బాక్సాఫీస్ వద్ద చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.10 లక్షల షేర్ కూడా రాలేదు. అదేంటి అంటే.. తెలుగులో ఈ సినిమాకి ప్రమోషన్ చేయలేదు అంటున్నారు ‘భ్రమయుగం’ ఫ్యాన్స్. సో డబ్బింగ్ సినిమాలు కొనుగోలు చేసే వాళ్ళు కూడా.. ఆ సినిమాని తెలుగులో ప్రమోషన్స్ చేయమని మేకర్స్ కి చెప్పాలన్నమాట.