నంది అవార్డుల వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటివరకు అవార్డు రాలేదని గుణశేఖర్, బుజ్జి, బండ్ల గణేష్, బన్నీ వాసు ఆవేదన వెళ్లగక్కారు. అయితే నంది అవార్డుల వివాదంపై మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు చేయడంతో అవార్డులు వచ్చిన వారు కూడా విరుచుకు పడుతున్నారు. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి నిన్న మీడియా ముందుకు వచ్చి ‘‘అవార్డులపై విమర్శించిన వారిని నాన్ లోకల్ చేస్తారా? మేం ఎన్ఆర్ఏ(నాన్‌రెసిడెంట్ ఆంధ్రాస్)లు అయితే మీరెవరు? తెలంగాణలో మీకు ఇల్లు, వ్యాపారాలు లేవా?’’ అంటూ లోకేష్‌పై పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నంది అవార్డులకు ప్రాంతీయత అంటగట్టడం, ఒకరిద్దరు విమర్శిస్తే నంది అవార్డులను ఎత్తేస్తారనడం సరికాదు” అని ముక్కుసూటిగా చెప్పారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు ప్రకటించిన నంది అవార్డును తిరస్కరిస్తున్నానని పోసాని ప్రకటించారు. పోసానికి సినీ పరిశ్రమలోని అనేక మంది మద్దతు తెలుపుతున్నారు. బన్నీ వాసు అయితే ప్రత్యక్షంగా మద్దతు తెలిపారు. “మనం ఏపీలో పుట్టాం.. ఏపీలో పెరిగాం.. ఏపీలోనే చదువుకున్నాం.. అమెరికాలో కాదు. మనం ఏపీ వాళ్లమని రుజువు చేసువాల్సిన అవసరం లేదు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో టాలీవుడ్ రెండుగా చీలిపోయే ఆస్కారం ఏర్పడింది.