టాలీవుడ్ నటి మాధవీలత(Maadhavi Latha) చిక్కుల్లో పడ్డారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె.. తాజాగా షిరిడీ సాయి బాబాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.’షిరిడీ సాయిబాబా దేవుడు కాదంటూ’ మాధవీలత సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెట్టారు. ఈ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ సాయి బాబా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు కొందరు హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మాధవీలతపై FIR నమోదు చేశారు.కేవలం మాధవీలత మాత్రమే కాదు.. ఆమె చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ఇంటర్వ్యూలు తీసుకుని, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసిన పలువురు యూట్యూబర్లపైన కూడా కేసులు నమోదయ్యాయి. ఈ వివాదానికి సంబంధించిన డిజిటల్ ఎవిడెన్స్‌ను పోలీసులు సేకరిస్తున్నారు.

విచారణలో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలంటూ మాధవీలతతో పాటు సదరు యూట్యూబర్లకు నోటీసులు జారీ చేశారు.భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఇతరుల మతపరమైన విశ్వాసాలను కించపరిస్తే సహించేది లేదని, ఐటీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రేపు విచారణ తర్వాత పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మాధవీలత మహేష్ బాబు ‘అతిధి’, నాని ‘స్నేహితుడా’ వంటి సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు. ఆమె ఖాతాలో ‘నచ్చావులే’ అనే బ్లాక్ బస్టర్ కూడా ఉంది. అయితే కొన్నాళ్లుగా ఆమె సినిమాలకు దూరంగా రాజకీయాల్లో ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే.
