పాన్ ఇండియా స్టార్.. ప్రభాస్ పై పోలీసు కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో రెవెన్యూ అధికారులు కంప్లైంట్ చెయ్యడం వల్లే.. పోలీసులు ప్రభాస్ పై కేసును నమోదు చేసినట్టు తెలుస్తుంది. రాయదుర్గం సమీపంలోని సర్వే నెంబర్ 46వద్ద 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్ళుగా వివాదం నడుస్తూనే ఉంది. ఇక ఇదే సర్వే నెంబర్‌లో 2,200 గజాల్లో ప్రభాస్ విలాసవంతమైన గెస్ట్ హౌస్ ను నిర్మించుకున్నాడు.
జీవో నెంబర్ 59 క్రింద దీన్ని క్రమబద్ధీకరించాలని కూడా దరఖాస్తు చేయించుకున్నాడు. కానీ ఈ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా నిర్ధారిస్తూ.. గతంలో శేరిలింగంపల్లి తహసీల్దార్ బృందం స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగింది.ఈ క్రమంలో ప్రభాస్ హైకోర్టును కూడా ఆశ్రయించాడు.ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో తన గెస్ట్ హౌస్ లోకి ప్రవేశించేందుకు ప్రభాస్ యత్నించాడని రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు పై కూకట్ పల్లి కోర్టులో ట్రయల్ జరుగనుందని తెలుస్తుంది.
ఇప్పుడు ఈ టాపిక్ వైరల్ గా మారింది. ‘హైకోర్టు తరువాత సుప్రీమ్ కోర్ట్ లో అయినా న్యాయం కోసం పోరాడవచ్చు. అప్పుడే ప్రభాస్ కు ఇంత కంగారు ఎందుకు?’ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఇప్పుడు ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు ప్రభాస్. అది పూర్తయ్యాక నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.