పాన్ ఇండియా ట్రెండులో ఇప్పటివరకు ఏ హీరోకూ సాధ్యం కాని ఒక అరుదైన, ఆశ్చర్యకరమైన రికార్డును ప్రభాస్ నెలకొల్పబోతున్నారు. సాధారణంగా ఒక సినిమాకు వందల కోట్ల బిజినెస్ జరిగితేనే గొప్ప అనుకుంటాం. కానీ ఒక్క హీరో మీద ఏకంగా రూ. 4500 కోట్ల పందెం కాయడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్న ఈ భారీ లెక్కలు చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.
నిజానికి ఇది ఒక రకంగా సాహసం అనే చెప్పాలి. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఉన్న ఐదు సినిమాల మొత్తం బిజినెస్ విలువ ఇది. కేవలం కాంబినేషన్ల క్రేజ్, బాహుబలి తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ వల్లే బయ్యర్లు ఇంత ధైర్యం చేస్తున్నారు. అయితే ఈ నెంబర్ ఎంత కిక్ ఇస్తుందో, అంతకు మించిన భయాన్ని కూడా కలిగిస్తోంది. ఏ చిన్న తేడా వచ్చినా, ఫలితం తారుమారైతే జరిగే నష్టం ఊహకందని విధంగా ఉంటుంది.
ఈ 4500 కోట్ల బిజినెస్ లో టాప్ 3 సినిమాలు క్రేజీ కాంబినేషన్స్ తో సిద్దమవుతున్నాయి. నాగ్ అశ్విన్ ‘కల్కి 2’ గ్లోబల్ ఇంపాక్ట్ వల్ల రూ. 1350 కోట్లు, సందీప్ వంగా ‘స్పిరిట్’ మీద ఉన్న పిచ్చి క్రేజ్ వల్ల రూ. 1200 కోట్లు, ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ కోసం రూ. 900 కోట్ల వరకు బిజినెస్ లెక్కలు కడుతున్నారు. కేవలం ఈ మూడు సినిమాలే దాదాపు మూడు వేల కోట్లను దాటించేస్తున్నాయి.
ఇక మిగిలిన రెండు చిత్రాలు కూడా తక్కువేమీ కాదు. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ‘ది రాజా సాబ్’ హారర్ కామెడీ కాబట్టి సేఫ్ బెట్ గా రూ. 400 కోట్లు, హను రాఘవపూడి ‘ఫౌజీ’ క్లాస్ టచ్ తో రూ. 600 కోట్ల వరకు మార్కెట్ ను సెట్ చేసుకునే అవకాశం ఉందట. ఇలా ప్రతి సినిమా తన రేంజ్ కు మించి బిజినెస్ చేస్తూ, ప్రభాస్ స్టామినాను హై లెవెల్లో నిలబెడుతున్నాయి.
ఇది కేవలం ప్రభాస్ స్టార్డమ్ కు పరీక్ష మాత్రమే కాదు, ఆయన కంటెంట్ సెలెక్షన్ కు సవాల్. రూ. 4500 కోట్ల టార్గెట్ ను రీచ్ అవ్వాలంటే ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. ఏ మాత్రం టాక్ తేడా వచ్చినా బయ్యర్లు మునిగిపోతారు. మరి డార్లింగ్ ఈ భారీ బాధ్యతను ఎలా మోస్తారో, ఈ నెంబర్లకు బాక్సాఫీస్ దగ్గర ఎలా న్యాయం చేస్తారో చూడాలి.
