అతి సర్వత్రా వర్జయేత్.. ఈ మాట చాలాసార్లు వినే ఉంటారు. ఏదైనా పని చేయాల్సిన దాని కన్నా ఓవర్‌గా చేస్తే ఈ మాట చెబుతుంటారు. మాకు భావప్రకటాన స్వేచ్చ ఉంది, మాకు నచ్చింది చేసుకోమని రాజ్యాంగం హక్కు ఇచ్చింది అంటూ కొంతమంది అప్పుడప్పుడు వెర్రి చేష్టలు చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా యుగం వచ్చాక దానికి ఫాలో అవుతూ ఏదైనా అంటే ట్రెండ్ అంటుంటారు. అలా రీసెంట్‌గా బయటికొచ్చిన ట్రెండ్ లాంటి పైత్యం ‘న్యూడ్ ఫొటో ఛాలెంజ్’. ఈ మాటలు మేం అనడం లేదు. సోషల్ మీడియాలో ఇప్పుడిదే చర్చ.
చిత్రవిచిత్రమైన ఫొటోలు, డ్రెస్‌లు, లుక్‌లతో ఆకట్టుకుంటున్నా అనుకునే బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రారంభించిన పని ఇది. వంటి మీద నూలు పోగు లేకుండా కొన్ని పోజులు ఇచ్చి, వాటిని సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు రణ్‌వీర్. దానికి ఆయన భార్య దీపికా పడుకొణె కూడా వావ్ అంటూ ఓ కామెంట్ పెట్టింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆ ఫొటోలు పట్టుకుని నానా రచ్చ చేశారు. నెటిజన్లు రెండుగా విడిపోయి ఒకరు సపోర్టు, మరొకరు అపోజ్ చేశారు. హీరోయిన్లు కొందరైతే రణ్‌వీర్‌కు సపోర్టు చేశారు.
అయితే, ఈ విషయం ఇప్పుడు కేసుల వరకు వెళ్లింది. అలాంటి పొటోలకు పోజులిచ్చి మా మనోభావాలు దెబ్బ తీశారు అంటూ రణ్‌వీర్ సింగ్‌పై కేసు నమోదైంది. సామాజిక మాధ్యమాల్లో నగ్న చిత్రాల ప్రదర్శన ద్వారా మహిళల సెంటిమెంట్లను గాయపరిచారంటూ రణ్‌వీర్ సింగ్‌పై ముంబయి పోలీసులకు రెండు ఫిర్యాదులు వచ్చాయి. ఒక స్వచ్ఛంద సంస్థ, మహిళా న్యాయవాది వీటిని దాఖలు చేశారు. రణ్‌వీర్‌పై ఐటీ చట్టంతోపాటు భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కోరారు.
రణ్‌వీర్ న్యూడ్ ఫొటోల తర్వాత విష్ణు విశాల్, నందు లాంటివాళ్లు ఇలాంటి ఫొటోలకు పోజ్ ఇచ్చారు. ఇప్పుడు రణ్‌వీర్ విషయం కేసుల వరకు వెళ్లడంతో తర్వాత ఇంకెవరైనా ఇలాంటి పోజులిస్తారా అనేది చూడాలి. సినిమాల్లో ఇలాంటి సీన్లు కనిపిస్తే ఓ లెక్క కానీ.. బయట ఇలాంటి పోజులేంటి అని ప్రశ్నిస్తున్నారు. అదేంటి కొంతమంది హీరోయిన్లు కూడా ఇలాంటి పని చేస్తున్నారు అని అంటారా? అప్పుడు కూడా ఇలానే నిరసనలు వచ్చాయి కదా. ఇప్పుడూ అంతే.