Charuhasan: ఆసుపత్రిలో చేరిన కమల్‌ హాసన్‌ అన్నయ్య.. ఇప్పుడు ఎలా ఉందంటే?

ప్రముఖ సీనియర్‌ నటుడు, దర్శకుడు చారు హాసన్‌ (Charuhasan) అస్వస్థతకు గురయ్యారు. ఆయన ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌కు (Kamal Haasan) అన్నయ్య అనే విషయం తెలిసిందే. గురువారం రాత్రి ఆయన అనారోగ్యానికి గురవడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు ఆయన కుమార్తె, ప్రముఖ నటి సుహాసిని (Suhasini Maniratnam) మణిరత్నం (Mani Ratnam) సోషల్‌ మీడియాలో తెలియజేశారు. ఆయనకు ఎలా ఉంది అనే విషయాన్ని కూడా పేర్కొన్నారు. దీపావళికి ముందు మా తండ్రి చారు హాసన్‌ అస్వస్థతకు గురయ్యారు.

Charuhasan

మా పండుగ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది. ప్రస్తుతం నాన్న సర్జరీకి సిద్ధమవుతున్నారు అని సుహాసిని తన పోస్టులో రాసుకొచ్చారు. ఆయనకు ఈ రోజు సర్జరీ కూడా పూర్తయినట్లు సమాచారం. అయితే ఆరోగ్య పరిస్థితి ఇంకా కుదుటపడాల్సి ఉంది అని కోడంబాక్కం వర్గాల సమాచారం. చారు హాసన్‌కు ఇప్పుడు 93 ఏళ్లు. ఈ క్రమంలో వృద్ధాప్య ఆరోగ్య సమస్యలు ఆయన్న ఇబ్బంది పెడుతున్నాయి.

ఆగస్టులో ఈ మేరకు ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆసుపత్రిలో చేరడం గమనార్హం. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. చారు హాసన్‌.. నటుడిగా, దర్శకుడిగా తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో నటించి మెప్పించారు. కన్నడ సినిమా ‘తబరణ కథ’కు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు.

ఈ ఏడాది ఆరంభంలో ఆయన నటించిన ‘హర’ అనే తమిళ సినిమా వచ్చింది. తెలుగులో ‘పాప్ కార్న్’ సినిమాలో ఆఖరిగా కనిపించారు. ఆ తర్వాత ఆయన వెండితెరపై కనిపించలేదు. చారు హాసన్‌కు సుహాసిని, సుభాషిని, నందిని అని ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus