చిరంజీవి ప్రేమను ఒక్కోసారి తట్టుకోలేం.. చూసినా, విన్నా ఒక్కోసారి కన్నీళ్లు వచ్చేస్తాయి. అంతలా ఆ వ్యక్తి మీద తనకున్న ప్రేమను, వాత్సల్యాన్ని, గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు. అది సాధారణ ప్రెస్ మీట్ అయినా, పర్సనల్ మీట్ అయినా, బహిరంగ సభ అయినా చిరు తన ప్రేమను చూపిస్తూ ఉంటారు. తాజాగా ‘పక్కా కమర్షియల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా తన ప్రేమను చాటారు చిరంజీవి. ఈ క్రమంలో చిరంజీవి మాటలు విని రావు రమేశ్ ఓ దశలో భావోద్వేగానికి లోనయ్యారు. ఎందుకంటే చెప్పింది ఆయన గురించి, ఆయన తండ్రి గురించే.
చిరంజీవి, రావు గోపాలరావు కలసి చాలా సినిమాలు చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆ అనుబంధం గొప్పగా ఉండేది అని నాటి విషయాలు తెలిసిన సీనియర్ పాత్రికేయులు చెబుతుంటారు. దాని గురించి ఇటీవల కాలంలో చిరంజీవి తొలిసారి చెప్పుకొచ్చారు. రావు గోపాలరావుకు, తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి వివరించారు చిరంజీవి. అలాగే రావు గోపాలరావు వారసుడిగా వచ్చి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రావు రమేశ్ గురించి మనసకు హత్తుకునేలా చెప్పారు చిరు. రావుగోపాలరావుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న చిరంజీవి…
ఆయన్ని చిన్నమామయ్య అని పిలిచేవాడినని గుర్తు చేసుకున్నారు. మా మామయ్య అల్లు రామలింగయ్య, రావు గోపాలరావులది అన్నదమ్ముల అనుబంధం కాబట్టి అలా అనేవాడిని అని చెప్పారు చిరు. అలాగే రావు గోపాలరావుకూ తనంటే ఎంతో ప్రేమ అని, ఇంటి నుండి తరచూ నా కోసం భోజనం తీసుకువచ్చేవారని చెప్పారు చిరు. వంకాయ కూరని శ్రీదేవి బుగ్గల్లా, చికెన్‌ని మరొక విధంగా అన్వయించి చెప్పి తినేవరకూ ఊరుకునేవారు కాదని నాటి రోజుల గురించి చెప్పారు చిరు. అత్తయ్య (రావు గోపాలరావు సతీమణి) తులసీచారు చేసి ప్రత్యేకంగా పంపించేవారని చెప్పిన చిరు, మా మధ్య అంతటి గొప్ప ఆత్మీయత ఉండేది అని వివరించారు.
నాన్న స్ఫూర్తితో పరిశ్రమలోకి వచ్చిన రావు రమేశ్ విభిన్నమైన పాత్రలు చేస్తూ గొప్ప నటుడు అయ్యారని మెచ్చుకున్నారు. తన తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తూ ఉత్తమ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారని కొనియాడారు చిరు. రమేశ్ అత్యున్నత స్థాయికి వెళ్లాలని, అలాగే తన సినిమాల్లోనూ నటించాలి అని చిరు కోరారు. చిరంజీవి మాటలతో రావు రమేశ్ ఓ దశలో ఉద్వేగానికి లోనయ్యారు. చిరంజీవి మాటలు పూర్తి చేస్తుంటే కాళ్లకు నమస్కరించి, ఆత్మీయ ఆలింగనం కూడా చేసుకున్నారు రావు రమేశ్.