మెగాస్టార్ చిరంజీవి కొన్నిరోజుల క్రితం ఏపీ సీఎం జగన్ ను కలిసి టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రధానంగా ఎదుర్కొంటున్న టికెట్ రేట్ల సమస్య గురించి చర్చించారు. భేటీ అనంతరం సీఎం జగన్ పాజిటివ్ గా స్పందించారని త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వంపై ఎవరూ నెగిటివ్ కామెంట్లు చేయవద్దని టికెట్ రేట్ల అంశం గురించి స్పందించవద్దని చిరంజీవి ఇండస్ట్రీ జనాలకు సూచించారు. పది రోజుల్లోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చిరంజీవి చెప్పగా పదిహేను రోజులైనా ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు.
ఫిబ్రవరి పదో తేదీలోపు టికెట్ రేట్లు పెరుగుతాయని ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ఎటువంటి స్పష్టత రాలేదు. రాబోయే నాలుగు నెలల్లో రిలీజ్ కానున్న పెద్ద సినిమాలన్నీ ఏపీ టికెట్ రేట్లపైనే ఆశలు పెట్టుకున్నాయి. ఏపీలో టికెట్ రేట్లు పెరగని పక్షంలో తమకు భారీగా నష్టాలు తప్పవని నిర్మాతలు భావిస్తున్నారు. ఏపీ టికెట్ రేట్ల విషయంలో చిరంజీవి మాట చెల్లుబాటు అవుతుందో లేదో చూడాల్సి ఉంది. ఏపీలో ప్రస్తుతం 50 శాతం ఆక్యుపెన్సీతో పాటు నైట్ కర్ఫ్యూ నిబంధన అమలవుతోంది.
ఇతర రాష్ట్రాలలో ఎక్కడా థియేటర్ల విషయంలో ఆంక్షలు అమలు కావడం లేదు. ఫిబ్రవరిలో ఖిలాడీ, భీమ్లా నాయక్ రిలీజ్ కానున్నాయి. ఏపీలో ఆంక్షలు అమలైతే భీమ్లా నాయక్ రిలీజ్ విషయంలో మార్పు ఉండే అవకాశం ఉంది. భీమ్లా నాయక్ రిలీజ్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో అని ఇండస్ట్రీ పెద్దలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచినా ఆ టికెట్ రేట్లు పెద్ద సినిమాల నిర్మాతలకు ఆమోదయోగ్యంగా ఉంటాయా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
ఏపీ సర్కార్ టికెట్ రేట్లను పెంచకపోతే మాత్రం పెద్ద సినిమాల నిర్మాతలకు ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. ఈ నెల 10వ తేదీన ఏపీ టికెట్ రేట్ల విషయంలో కొంతమేర క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ టికెట్ రేట్లను పెంచుతామని చిరంజీవికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.