పది మందికి పంచని అనుభవం, జ్ఞానం ఎందుకు దండగ అంటుంటారు పెద్దలు. పంచితే తరిగిపోయేది కూడా కాదు అని కూడా చెబుతుంటారు. మరి ఈ మాట గుర్తొచ్చిందో లేక దర్శకులు పూరి జగన్నాథ్, హరీశ్ శంకర్ చేసిన పనులు గుర్తొచ్చాయో, లేకపోతే రాఘవేంద్రరావు, పరుచూరి గోపాలకృష్ణ గుర్తొచ్చారో.. లేక అక్కినేని ఆలోచనలు గుర్తొచ్చాయో కానీ ప్రముఖ కథానాయకుడు చిరంజీవి కూడా పాఠాలు చెబుదామని ఫిక్స్ అయ్యారు. ఇటీవల తనను కలసి జర్నలిస్టులతో మాట్లాడుతూ పాడ్‌కాస్ట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఈ విషయమే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
అంతర్జాతీయ సోషల్ మీడియాలో పాడ్‌కాస్ట్‌లు పెరిగాయి. ఆడియో రూపంలో తమ సందేశాన్ని, అనుభవాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్నారు కొంతమంది ఔత్సాహికులు. అందులో స్టార్ నటులు, సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. గత కొన్నేళ్లుగా అప్పుడప్పుడు పూరి జగన్నాథ్ కూడా ఇదే పని చేస్తున్నారు. ఇప్పుడు తానూ అలాంటి ఆలోచన చేస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. దీని కోసం బీవీఎస్ రవి అండ్ టీమ్ పని చేస్తోందని చూఛాయగా చెప్పారు చిరు.
అందులో సినిమా అనుభవాలు, జీవితంలో నేర్చుకున్న ఆసక్తికర పాఠాల గురించి చెప్పాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నారట. సినీ రంగంలో చిరుది నాలుగు దశాబ్దాల ప్రయాణం. మూడు తరాల నటులు, టెక్నీషియన్లతో కలసి పని చేశారు. ఈ క్రమంలో మూటగట్టుకున్న అనుభవాలను ఈ పాడ్‌కాస్ట్‌లో ఎపిసోడ్ల వారీగా చెబుతారు అని తెలుస్తోంది. ఈ క్రమంలో నాటి ఆసక్తికర విషయాలు చాలా ప్రేక్షకులకు తెలిసే అవకాశం ఉంది.
పూరి మ్యూజింగ్స్ చేసిన తొలి రోజుల్లో హరీశ్ శంకర్ కూడా కొన్ని పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లు చేశారు. అయితే తర్వాత కొనసాగించలేదు. ఇక రాఘవేంద్రరావు అయితే ‘సౌందర్య లహరి’ అంటూ తన సినిమాల విషయాలు షేర్ చేసుకున్నారు. ‘పరుచూరి పలుకులు’ అంటూ పరుచూరి గోపాలకృష్ణ సినిమాల రివ్యూలు, ఆసక్తికర అంశాలు చెబుతూ వస్తున్నారు. అయితే వీరిద్దరూ వీడియో రూపంలో చేశారు. అక్కినేని కూడా ఇలానే టీవీకి ఓ షో చేశారు.