మెగాస్టార్ మదర్ అంజనాదేవి గారు అనారోగ్యం పాలైనట్లు తెలుస్తుంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారట. ఈ వార్త కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉంది. కానీ ‘అమ్మకు ఆరోగ్యం బాలేదు’ అని తెలిపి ఆ కార్యక్రమానికి హాజరుకాలేదట పవన్ కళ్యాణ్.
హుటాహుటిన ఆయన హైదరాబాద్ కు బయలుదేరినట్టు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె వయసు 89 ఏళ్ళు అని తెలుస్తుంది. కొన్నాళ్లుగా ఆమె వయోభారంతో ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అంజనా దేవి గారు ఎక్కువగా చిరంజీవి ఇంట్లోనే ఉంటూ వస్తారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కి వస్తే అతని వద్దకు వెళ్లి ఉంటారు.
ఇక చాలా సినిమా వేడుకల్లో అంజనా దేవి గారు హాజరైన సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో చిరంజీవి గురించి, పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. చిరంజీవిని ఆమె శంకర్ బాబు అని పిలుస్తారు. పవన్ కళ్యాణ్ ని కళ్యాణ్ బాబు అని, నాగేంద్రబాబుని నాగబాబు అని పిలుస్తుంటారు అంజనా దేవి గారు.
ఆమెకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి మెగా అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ మధ్యనే ఆమె పుట్టినరోజుని కుటుంబ సభ్యులు అంతా ఏకమై ఘనంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా చిరు తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.