చిత్ర పరిశ్రమలో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న మెగా ఫ్యామిలీ రాజకీయంగా ఓ గట్టి ముద్ర వేయలేకపోయింది. అత్యంత ప్రజాదరణ ఉన్న హీరోగా చిరంజీవి దశాబ్దాల పాటు వెండితెరను ఎలినా, రాజకీయంగా ఫెయిల్ అయ్యారు. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాన్ని కొనసాగించలేక కాంగ్రెస్ లో విలీనం చేశారు. సీఎం పదవి టార్గెట్ గా మొదలైన చిరు రాజకీయం ప్రస్థానం మధ్యలోనే ముగిసిపోయింది. కొద్దిరోజుల క్రితం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కి కూడా బై బై చెప్పేసి పూర్తిస్థాయిలో సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఇక చిరంజీవి తమ్ముడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి స్టార్డం సొంతం చేసుకొని పెద్ద అభిమాన గణాన్ని పోగుచేసుకున్న పవన్ తన రాజకీయం పోరాటం కొనసాగిస్తున్నాడు.
అన్నయ్య పెట్టిన పి ఆర్ పి లో కీలక పాత్ర పోషించిన పవన్ 2014లో తానే స్వయంగా పార్టీ పెట్టారు. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ తన మొదటి ఎన్నికలలో స్వయంగా పోటీ చేయకుండా, టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. ఇక 2019 ఎలక్షన్స్ కి ముందు పవన్ మొదటగా బీజేపీ, తరువాత టీడీపీ తో విభేదించి సొంతగా ఎన్నికలలో పోటీకి దిగారు. ఫలితాలు పవన్ కి భారీ షాక్ ఇచ్చాయి. ఆ పార్టీ కేవలం ఒక్క సీటు గెలుచుకోగా, పవన్ పొటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు.
కారణం ఏదైనా పవన్ కొద్దినెలల క్రితం మళ్ళీ బీజేపీతో చేయి కలిపారు. కాగా పనిలో పనిగా అన్న చిరంజీవిని కూడా బీజేపీ కి ఆయన దగ్గర చేస్తున్నాడని అనిపిస్తుంది.ఈ మధ్య చిరు పవన్ నిర్ణయాలను గౌరవిస్తూ మోడీ ఆదేశాలను పాటిస్తున్నారు. మోడీ సైతం మెగా హీరోలకు ధన్యవాదాలు తెలుపుతూ, తెలుగులో ఓ ట్వీట్ వేశారు. కాంగ్రెస్ సమీప కాలంలో కోలుకోలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో చిరు కూడా బీజేపీ పార్టీ వైపు మొగ్గుచూపుతాడనే అనుమానాలు కలుగుతున్నాయి. భవిష్యత్తులో చిరు బీజేపీ కండుగా కప్పుకున్నా ఆశ్చర్యం లేదు.