‘పుష్ప’రాజ్ ఎలా అయితే ఇంటర్నేషనలో.. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తోపులాట / తొక్కిసలాట కూడా ఇంటర్నేషనల్ అయిపోయింది. ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2) సినిమా ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబరు 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట విషయమై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా విదేశాల్లో దీని గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ప్రశ్న ఎదురైంది. తొక్కిసలాట ఘటనలో ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టయి..
బెయిల్ పేపర్ వర్క్ జరగక ఒక రాత్రి జైలులోనే ఉంది, రెండో రోజు బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. ఆమె తనయుడు ఆస్పత్రిలో ఉన్నాడు. దీంతో ఈ విషయాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు విదేశాల్లోనూ అడిగారు. దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓ ఆంగ్ల మీడియా ప్రతినిధి అల్లు అర్జున్ విషయం గురించి అడిగారు.
దాంతో మరోసారి ఆయన స్పందించారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా అని ఆ విలేకరి అడగ్గా.. రేవంత్ గతంలో అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని మరోసారి వివరంగా అక్కడ మీడియాకు చెప్పారు. దీంతో ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. బెనిఫిట్ షోకి రావడానికి అల్లు అర్జున్ టీమ్ / థియేటర్ టీమ్ రెండు రోజుల ముందు అనుమతి కోసం వస్తే.. పోలీసులు నిరాకరించారని, అయినా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారని సీఎం రేవంత్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.
ఆయన వచ్చిన నేపథ్యంలో భారీగా అభిమానులు వచ్చారని, దీంతో బన్నీతో వచ్చిన ప్రైవేటు సెక్యురిటీ సిబ్బంది అక్కడున్న వారిని తోసేశారని సీఎం చెప్పారు. ఈ ఘటనలో ఒకరు చనిపోయారని, ఒక మనిషి చనిపోవడమన్నది ఆయన చేతుల్లో లేకపోవచ్చు. కానీ వద్దంటే థియేటర్‌కు రావడం వల్లే ఇదంతా జరిగింది అని సీఎం పేర్కొన్నారు. ఇక ఒక మహిళ చనిపోతే సుమారు రెండు వారాల వరకు బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదని విమర్శించారు సీఎం. మరోవైపు ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది అని క్లారిటీ ఇచ్చారు.