టికెట్ ధరల పెంపు.. ఏడాది క్రితం వరకు ఆంధ్రప్రదేశ్‌లో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పుడు అక్కడ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది, పరిస్థితులు కూడా మారిపోయాయి. ఏకంగా డబ్బింగ్ సినిమాలకు కూడా ఏపీలో టికెట్ రేట్ల పెంపు అవకాశం ఇస్తున్నారు. అయితే ఈ సమయంలో తెలంగాణలో పరిస్థితి మారిపోయింది. టికెట్ ధరల హైక్‌కు తెలంగాణలో అంత ఈజీగా కుదరడం లేదు. అడిగి లేదనిపించుకోవడం ఇష్టంలేక కొంతమంది నిర్మాతలు ప్రభుత్వాన్ని సంప్రదించడం మానేశారు.
కొంతమంది నిర్మాతలైతే ప్రభుత్వాన్ని తెలిసినవారి ద్వారా సంప్రదించి ప్రత్యేక జీవోలు తెచ్చుకున్నారు. అయితే హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ వ్యవహారం జఠిలమైంది. ఈ విషయమే అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకుంటున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై వైవిధ్యంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అంటూనే ఆయన ఓ మెలిక పెట్టారు. దీనిపై ఇప్పుడు నిర్మాతలు ఎలా ఆలోచిస్తారు అనేదే ఆసక్తికరంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు పెంచితే హీరోలకు, నిర్మాతలకు ఆదాయం వస్తోంది. కార్మికులకు ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు. అందుకే టికెట్ రేట్లు పెంచినప్పుడు, అలా వచ్చిన ఆదాయం నుండి 20 శాతం కార్మికులకు ఇవ్వాలి. అలా ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీగా చెప్పేశారు. ఈ మేరకు నిబంధనలు సవరిస్తామని కార్మికులకు హామీ కూడా ఇచ్చారు. దీంతో ఇప్పుడు టికెట్ రేట్ల పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు సంప్రదిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
దీంతో ఇప్పుడు ఈ విషయంలో నిర్మాతలు, టాలీవుడ్ హీరోలు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ఆ మధ్య పారితోషికాల విషయంలో సినిమా కార్మికులు షూటింగ్ ఆపేసి మరీ నిరసన తెలిపారు. అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి విషయం తేల్చారు. ఇప్పుడు ఇలా వాటా ఇవ్వాలని మాట్లాడారు. కాబట్టి విషయం ఆసక్తికరంగా మారింది.