సౌత్ ఇండియన్ స్టార్ హీరోల్లో విక్రమ్ ఒకరు. దాదాపు పదిహేనేళ్లుగా ఆయన కెరీర్ లో సరైన హిట్ పడడం లేదు. తన యాక్టింగ్ టాలెంట్ తో ఇండస్ట్రీలో కొనసాగుతూ.. ప్రతిసారీ తన సినిమా ట్రైలర్ వరకు అయినా ఆసక్తిని కొనసాగుతున్న విక్రమ్ కు ‘కోబ్రా’తో చాలా దారుణమైన అనుభవం మిగిలేలా ఉంది. తమిళనాడులో కూడా సినిమా కనీసపు ఓపెనింగ్స్ ను కూడా రాబట్టలేకపోయింది. ఈ సినిమాను తమిళ ఆడియన్స్ కూడా సీరియస్ గా తీసుకున్నట్లు లేరు.
తొలిరోజు ఈ సినిమాకి రూ.9 కోట్ల రూపాయల వరకు వసూళ్లు దక్కినట్లు తెలుస్తోంది. అయితే రెండో రోజు నుంచే పరిస్థితి మారిపోయింది. రెండోరోజు వసూళ్లు రెండున్నర కోట్లు, మూడో రోజుకి రెండు కోట్ల రూపాయల లోపు వసూళ్లు పడిపోయాయి. వీకెండ్ లో కూడా ఈ సినిమాకి సరైన కలెక్షన్స్ రాలేదు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు కనీసపు వసూళ్లు రూ.15 కోట్లు కూడా దాటలేదు. ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లోకి వచ్చే ఛాన్స్ కూడా లేదనేది క్లియర్ గా తెలుస్తుంది.
స్టైలిష్ మేకింగ్ అంటూ విక్రమ్ సినిమాల బడ్జెట్ లు వంద కోట్ల రేంజ్ లోనే ఉంటాయి. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పదో వంతు షేర్ కూడా రాకపోవడం మేకర్లకి నిరాశనే మిగిల్చింది. ఈ సినిమా రిజల్ట్ విక్రమ్ కెరీర్ ను ప్రశ్నార్ధకంగా మార్చేసింది. కోలీవుడ్ లోనే కనీసపు కలెక్షన్స్ ను రాబట్టలేకపోయిందంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు!