Ali: కమెడియన్ అలీకి నోటీసులు.. ఏం జరిగిందంటే..!

సినిమాల‌తో ఆకట్టుకుని, తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అలీ (Ali) తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలంలోని ఎక్‌మామిడి గ్రామపంచాయతీకి చెందిన ఫామ్‌హౌస్‌కు సంబంధించి ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారన్న ఆరోపణలతో గ్రామ పంచాయతీ అధికారులు అలీకి నోటీసులు పంపారు. గ్రామ కార్యదర్శి శోభారాణి ఇచ్చిన సమాచారం ప్రకారం, నటుడు అలీకి సంబంధించిన ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా పలు నిర్మాణాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి.

Ali

ఈ నెల 5న మొదటిసారి నోటీసులు జారీ చేయగా, అలీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఫలితంగా రెండోసారి నోటీసులు పంపి, వెంటనే వివరణ ఇవ్వాలని, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కార్యదర్శి స్పష్టం చేస్తూ, నిర్మాణాలు వెంటనే ఆపాలని, అనుమతులు పొందకుండా పనులు కొనసాగిస్తే పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అయితే ఈ రెండోసారి నోటీసులు ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్నవారికి అందజేసినట్లు సమాచారం. ఇది మొదటి సారి అలీ వివాదంలో ఇరుక్కోవడం కాదు. ప్రస్తుతం నోటీసులపై అలీ ఎలా స్పందిస్తాడో అన్నది ఆసక్తిగా మారింది. ఫామ్‌హౌస్ నిర్మాణాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తారా లేదా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.

ఇక అలీ ప్రస్తుతం టీవీ షోలతో పాటు పలు సినిమాల్లో నటిస్తూ తన కెరీర్‌ను ముందుకు సాగిస్తున్నాడు. రాజకీయాలకు గుడ్‌బై చెప్పినప్పటికీ, ఆయనపై వచ్చే వివాదాల కారణంగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ నోటీసుల వ్యవహారంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags