హాస్యనటుడిగా అడుగుపెట్టి హీరో గా సినిమాలు చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి చిక్కుల్లో ఇరుక్కున్నారు. అతని పేరు చెప్పి ఎవరో యువతీ యువకులను మభ్యపెడుతున్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే.. అమీర్‌పేటకు చెందిన రవికిరణ్ అనే వ్యక్తి, గత కొంత కాలంగా కొంతమంది సినిమా ఆర్టిస్టుల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఇప్పుడు ఆ పరిచయాలను వాడుకొని, ఆ ఆర్టిస్టుల పేర్ల పై నకిలీ ఫేస్‌బుక్ లను సృష్టించి, చాటింగ్ ద్వారా సినిమా అవకాశాలు ఇప్పిస్తానని, మరికొంత యువకుల దగ్గర మంచి కథలు ఉంటే చెప్పమని తనచుట్టూ తిప్పించుంటున్నాడు. అలాగే శ్రీనివాస్ రెడ్డి పేరు మీద కూడా నకిలీ ఖాతా సృష్టించాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి, ఆ పేస్ బుక్ వ్యక్తికీ.. తనకు ఎలాంటి సంబంధం లేదని అందరికీ స్పష్టంచేశారు. ఎవరో కావాలని తన పేరును మిస్ యూజ్ చేస్తున్నారని, అలాంటి వారిపై, తగిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఈరోజు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు రవికిరణ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం అంగీకరించిన అతనికి, పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి, మళ్లీ ఎప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించి వదిలిపెట్టారు. అలాగే నకిలీ వ్యక్తుల పట్ల యువతీయువకులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.