ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ వివాదంలో నిలిచింది. టీ సిరీస్ ఎండీ భూషణ్ కుమార్(43)పై అత్యాచారం కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. 2017లో తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మూడేళ్లపాటు భూషణ్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. మూడేళ్లపాటు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి మరీ తనను రేప్ చేశారని.. ముంబైలోని అంధేరీ డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
అయితే ఈ ఆరోపణలను టీ సిరీస్ ఖండించింది. ఆమె చేసే ఆరోపణల్లో నిజం లేదని.. ఈ మేరకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ ప్రకటన విడుదల చేసింది. పని పేరుతో ఆమెపై భూషణ్ అత్యాచారం చేశాడనేది పూర్తిగా అవాస్తవమని.. ఎందుకంటే గతంలో ఆమె సినిమా, మ్యూజిక్ వీడియోల కోసం టీ సిరీస్ బ్యానర్ లో పని చేసిందని అన్నారు. ఈ ఏడాది మార్చిలో ఓ వెబ్ సిరీస్ నిర్మించాలనుకున్న ఆమె ఆర్ధిక సాయం కోసం భూషణ్ కుమార్ ను సంప్రదించిందని ప్రకటనలో పేర్కొన్నారు.
కానీ ఆమె రిక్వెస్ట్ ను భూషణ్ కుమార్ సున్నితంగా తిరస్కరించారని.. ఆ తరువాత జూన్ లో భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ మరోసారి టీ సిరీస్ బ్యానర్ ను సంప్రదించిందని చెప్పారు. ఈ కామంతో దొంగతనానికి సైతం ప్రయత్నించగా.. ఆమెపై జూలై 1న కేసు పెట్టామని.. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ ఆధారాలను పోలీసులకు అప్పగిస్తామని.. దోపిడీ కేసుకి కౌంటర్ గా ఆమె ఫిర్యాదు చేసిందే తప్ప అంతకుమించి మరేం లేదని చెప్పుకొచ్చారు.