ఏపీలో టికెట్ రేట్లను గతేడాది ఏప్రిల్ నెల 8వ తేదీన తగ్గించారు. ఏపీలో టికెట్ రేట్లను తగ్గించడం వల్ల చిన్న సినిమాలకు పెద్దగా నష్టం లేకపోయినా పెద్ద సినిమాల కలెక్షన్లు మాత్రం ఊహించని స్థాయిలో తగ్గుతున్నాయి. పెద్ద సినిమాల తొలిరోజు కలెక్షన్లపై ఏపీ టికెట్ రేట్లు ఊహించని స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. పుష్ప, అఖండ సినిమాలు సైతం ఏపీలో బ్రేక్ ఈవెన్ కాలేదంటే ఏపీలో నెలకొన్న పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు.
అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం కొన్నిరోజుల క్రితం ఏపీలో టికెట్ రేట్ల అంశం గురించి సీఎం జగన్ తో చర్చలు జరిపి త్వరలోనే శుభవార్త వస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం ఏపీ టికెట్ల అంశం కోర్టు పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. కోర్టు సూచనల మేరకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయగా కమిటీ ఫిబ్రవరి 2వ తేదీన టికెట్ రేట్ల గురించి మరోసారి చర్చించనుంది. ఈ కమిటీ భేటీకి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరు కావాల్సి ఉన్నా ఆయన హాజరయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
వచ్చే నెల పదో తేదీన ఏపీ హైకోర్టులో టికెట్ రేట్ల గురించి విచారణ జరగనుంది. ఆ సమయానికి టికెట్ రేట్లు పెరిగితే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మరోవైపు ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ, నైట్ కర్ఫ్యూ నిబంధనలు అమలవుతున్నాయి. ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో నిబంధనలు సడలించే ఛాన్స్ లేదు. వచ్చే నెలలో ఖిలాడీ, భీమ్లా నాయక్ సినిమాలు రెండు వారాల గ్యాప్ లో రిలీజ్ కానున్నాయి.
ఏపీలో టికెట్ రేట్లు పెరిగితే ఈ రెండు సినిమాలకు ప్రయోజనం చేకూరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఏపీలో టికెట్ రేట్లు పెరిగినా ఇతర రాష్ట్రాల స్థాయిలో మాత్రం పెరగకపోవచ్చని సమాచారం అందుతోంది. అటు ప్రభుత్వానికి ఇటు థియేటర్ల యజమానులకు ఆమోదయోగ్యంగా టికెట్ రేట్లను పెంచనున్నారని తెలుస్తోంది. టికెట్ రేట్లు పెంచితే సినిమాలను రిలీజ్ చేయాలని పలువురు పెద్ద సినిమాల నిర్మాతలు భావిస్తున్నారు.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!