లాక్ డౌన్ అనంతరం టాలీవుడ్ లో జరగబోయే భారీ ఫంక్షన్ అంటే అది ‘వకీల్ సాబ్’ అనే చెప్పాలి. పైగా మూడేళ్ల తరువాత పవన్ రీఎంట్రీ ఇస్తోన్న సినిమా కావడం, ఈ ఈవెంట్ కి మెగాస్టార్, రామ్ చరణ్ లు అతిథులుగా రానున్నారనే విషయం తెలియడంతో అభిమానుల్లో విపరీతమైన బజ్ పెరిగిపోయింది. ఈ ఒక్క ఈవెంట్ కోసం దిల్ రాజు కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. అంటే ఎంత గ్రాండ్ గా నిర్వహించాలని అనుకుంటున్నారో ఊహించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ కి ఫ్యాన్స్ ని పిలవాలా..? వద్దా..? అనే విషయంలో ‘వకీల్ సాబ్’ టీమ్ డైలమాలో పడింది.
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఈ సమయంలో ఫ్యాన్స్ తో కలిసి ఫంక్షన్ పెడితే ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు దర్శకనిర్మాతలు. ఫ్యాన్స్ ని పిలిచి, పాస్ లు ఇచ్చి చివరికి హ్యాండ్ ఇస్తే ఎవరూ ఊరుకోరు. అలా అని ఫ్యాన్స్ లేకుండా ఈవెంట్ కూడా చేయలేరు. అందుకే ఈ వేడుకకి ఫ్యాన్స్ ని పిలవాలా..? లేదా అనే విషయాన్ని హీరో పవన్ కళ్యాణ్ కి వదిలిపెట్టాడు నిర్మాత దిల్ రాజు. సాధారణంగానే మెగాహీరోల సినిమా ఫంక్షన్స్ అనే రచ్చ మాములుగా ఉండదు. పైగా ఈసారి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లను ఒకేసారి స్టేజ్ పై చూసే ఛాన్స్ వస్తుందంటే ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండదు.
హీరోలు కూడా తమ ఫ్యాన్స్ సమక్షంలోనే ఇలాంటి ఈవెంట్స్ జరగాలని కోరుకుంటారు. ఫ్యాన్స్ చేసే అల్లరి మన హీరోల్లో జోష్ మరింత పెచుతుంది. కానీ ‘వకీల్ సాబ్’ ఈవెంట్ కోసం తరలి వచ్చే ఫ్యాన్ క్రౌడ్ ని తట్టుకోగలరా అనే ప్రశ్న ఎదురవుతోంది. హైదరాబాద్ పోలీసులు కూడా అంతమంది జనాలు వచ్చే ఈవెంట్ అంటే పర్మిషన్స్ ఇస్తారా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!